Monday, May 6, 2024

పౌష్టికాహార రేషన్‌.. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

అమరావతి, ఆంధ్రప్రభ : రేషన్‌ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా పంపీణ వ్యవస్థ ద్వారా పేదలకు పౌష్టికాహారాన్ని అందించే చేసే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని 1.47 కోట్ల రైస్‌ కార్డుదారులకు పౌష్టికాహారాన్ని అందించేలా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యంను అన్ని జిల్లాల్లో పీడీఎస్‌, ఎండీఎం, ఐసీడీఎస్‌ ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం చేకూర్చటానికి ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఫైలట్‌ ప్రాజెక్ట్‌ గా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అందించనున్నారు. దేశంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవనుంది. ఫోర్టిఫైడ్‌ బియ్యంను పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోనూ తయారు చేస్తున్నారు.

ఐసీడీఎస్‌ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 3 కేజీల పోషక బియ్యం ప్యాకెట్లను ఇంటికే రేషన్‌ పథకం కింద పంపిణీ చేస్తున్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంతో పాటు రేషన్‌ దుకాణాల్లో ఫోర్టిఫైడ్‌ కెర్నల్స్‌ కలిపిన గోధుమ పిండి కూడా అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి టెండర్లు పిలిచే దిశగా సివిల్‌ సప్లైస్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బలవర్ధకమైన ఫోర్టిఫైడ్‌ బియ్యం ప్రతి ఒక్కరూ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం.

ప్రయాజనాలు ఎన్నో..

- Advertisement -

ఫోర్టిఫైడ్‌ బియ్యం లో ఐరన్‌, పోలిక్‌ ఆవ్లుం, బి12 ఉంటాయి. వీటి వలన ఐరన్‌ రక్తహీనతను నిరోధిస్తుంది. ఫోలిక్‌ ఆవ్లుం రక్తం ఏర్పడటానికి సహయపడుతుంది. బి12 విటమిన్‌తో నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ ను సాధారణ బియ్యంలో 1:100 నిష్పత్తిలో కలపటం వల్లన పోషక బియ్యం తయారవుతుంది. ఈ బియ్యం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంతో శరీరానికి పోషకాలు అందటమే కాకుండా విటమిన్స్‌ అందుతాయి.

అపోహలు నివృత్తి చేసేలా ప్రచారం..

ఫోర్టిఫైడ్‌ బియ్యం వండటానికి నీళ్లలో కలిపినప్పుడు అవి నీటిపై తేలటంతో ఫ్లాస్టిక్‌ బియ్యం అనే అపోహ ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఫోర్టిఫైడ్‌ బియ్యం ప్లాస్టిక్‌ బియ్యం అనే అనుమానాలు తీరాలంటే మెడికల్‌ షాపుల్లో దొరికే అయోడిన్‌ ను తెచ్చి ఫోర్టిఫైడ్‌ బియ్యంపై వేస్తే నీలం రంగులోకి మారతాయి. ప్లాస్టిక్‌ అయితే రంగు మారవు. నీళ్లలో నానబెట్టినప్పడు ఫోర్టిఫైడ్‌ బియ్యం త్వరగా మెత్తబడతాయి. ప్లాస్టిక్‌ మెత్తబడదు.

ఈప్రక్రియతో బియ్యం ఫోర్టిఫైడా, ఫ్లాస్టిక్కా అన్నది నిర్ధారించుకోవచ్చు. ఫోర్టిఫైడ్‌ బియ్యంపై పేద,మధ్యతరగతి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంచటానికి ప్రభుత్వం ఇప్పటికే పోస్టర్లు రూపొందించారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు తో వీడియో కూడా రూపొందించి ప్రచారం నిర్వహించనున్నారు. విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఫోర్టిఫైడ్‌ బియ్యం తీసుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పౌష్టికాహారం పంపిణీ దిశగా

పేద, మధ్యతరగతి వర్గాలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాగులు, జొన్నులు పంపిణీ చేస్తోంది. ఎండీయూల ద్వారా ప్రతి కార్డుకు మూడు కేజీల బియ్యంకు బదులు రాగులు, జొన్నలు అందిస్తోంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కొర్రలను పీడీఎస్‌ రైస్‌ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మన రాష్ట్రంలోపండే చిరుధాన్యాలు, కందులు స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్ధతు ధర అందించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1.47 లక్షల రైస్‌ కార్డు దారులు ఉండగా ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసవరం అవుతోంది. అక్టోబర్‌ నుంచి సబ్సిడీపై కందిపప్పును అందించే విధం గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర అవసరాల కోసం 50 వేల టన్నుల కందిపప్పు నిల్వలను కేటాయించాలని కేంద్రాన్ని కోరింది.

రాష్ట్రంలోని రైతుల నుంచి నేరుగా కందులను కొనుగోలు చేసి మిల్లింగ్‌ అనంతరం పీడీఎస్‌ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాల్టిలు కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో ఫోర్ట్‌ఫైడ్‌ గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. కార్డుకు కిలో రూ.16 చొప్పున అందిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement