Tuesday, May 14, 2024

ఏ ఇంటికి వెళ్లినా అన్యాయం జరిగిందన్న ఆవేదనే ! : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

భీమారం : చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిఎల్పి సభ పక్షనేత భట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర భీమారం మండలం దాంపూర్ గ్రామం చేరుకుంది. ఆదివారం పాదయాత్ర మొదలై బూర్గుపెల్లి, చేరుకోగా భారీ జనానీరజనంతో మహిళలు, నాయకులు, మంగళ హారతులతో, డప్పు వాయిద్యాలతో, నినాదాలతో ఘన స్వాగతం పలికారు. పోతనపల్లి, చేరుకోగానే గ్రామస్తులు శాలువాతో సత్కారించి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏ ఇంటికి వెళ్లిన ఏడుపు, దుఃఖం, అన్యాయం జరిగిందన్న ఆవేదనే ఉందన్నారు. రాష్ట్ర సంపదను రాబందుల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుంద‌న్నారు. 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూముల్లోకి మూడేళ్లుగా ఫారెస్ట్ అధికారులు రానివ్వడం లేదని ధరావత్ లక్ష్మి అనే పేద మాహిళ ఆవేదన చాలా బాధించిందన్నారు. నా కన్నీళ్ళతో కాళ్లు కడిగిన వాళ్లకు కనికరం కాలేదని ధరావత్ లక్ష్మి విలపించిన తీరుతో నా గుండె తరుక్కుపోయిందన్నారు.

ప్ర‌జల బాధలు విన్న తర్వాత వారి సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయాలన్న పట్టుదల పెరిగింద‌న్నారు. క‌న్నీళ్లు ఇబ్బందులు లేనటువంటి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ఆ మహిళను అక్కున చేర్చుకొని ఓదార్చి మంచి రోజులు వస్తాయని దైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫారెస్ట్ రైట్ యాక్ట్ అమలు చేసి పోడు రైతులందరికీ పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు. మీ ఇండ్లకే వచ్చి.. మీ సమస్యలు పరిష్కరించి భూమి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసి దుక్కి దున్నించి పంట పండించే వరకు అండగా ఉంటాం అన్నారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో ఆర్థిక సార్ధకత పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి పావలా వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం చేస్తున్నద‌న్నారు. వడ్డీ లేని రుణాలు, పావల వడ్డీ రుణాలు ఇవ్వకుండా మహిళలను బీఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేస్తునద‌న్నారు. ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడమే మన సమస్యల పరిష్కారం మార్గం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement