Wednesday, May 8, 2024

ఇజ్రాయిల్‌లో కొత్త వేరియంట్‌? ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌గా అనుమానం..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ఉధృతి తగ్గినట్టే తగ్గి మళ్లి పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో సరికొత్త వేరియంట్‌ కేసులు నమోదవడం కలవరపరుస్తోంది. విదేశాలనుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కొత్త వేరియంట్‌ వైరస్‌ను గుర్తించామని ఇజ్రాయిల్‌ ఆరోగ్యశాఖ మంత్రి ధ్రువీకరించారు. ప్రపంచంలో ఇలాంటి వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇప్పటివరకు ఎక్కడా వెలుగుచూడలేదని ఆ దేశ వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త వేరియంట్‌ కేసుల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపారు. దీనిపై ఇంకా ఆ సంస్థనుంచి ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. కాగా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు ఉప ఉత్పరివర్తనాలైన బీఏ1, బీఏ2 కలగలసిిన రకంగా భావిస్తున్నామని ఇజ్రాయిల్‌లో కరోనా నివారణ విభాగం అధికారి సల్మాన్‌ జర్కా వెల్లడించారు. కొత్తరకం వేరియంట్‌ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తాజా పరిణామం పట్ల పెద్దగా ఆందోళన చెందడం లేదని వెల్లడించారు. దాదాపు 91 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయిల్‌లో ఇప్పటికే 45 లక్షలమందికి రెండుడోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు, వేరియంట్లపై సమగ్ర పరిశీలన చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

ఇవీ లక్షణాలు..

కొత్త వేరియంట్‌ వైరస్‌ సోకిన రోగుల్లో స్వల్పస్థాయిలో జ్వరం, కండరాల నొప్పులు, తలనొప్పి కన్పిస్తున్నాయని ఇజ్రాయిల్‌ వైద్యాధికారులు వెల్లడించారు. దీనికి పెద్దగా చికిత్స అవసరం లేదని, సాధారణ వైద్యంతోనే రోగులు కోలుకుంటున్నారని పేర్కొంది.

ద.కొరియాలో కరోనా విశ్వరూపం..

దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. బుధవారం దేశవ్యాప్తంగా 4 లక్షల కొత్త కేసులు నమోదు కాగా గురువారం ఒక్కరోజే 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ తలెత్తిన తరువాత దేశంలో గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. గడచిన 24 గంటల్లో 6 లక్షల 21 వేల 328 కేసులు నమోదయ్యాయని, 429 మంది మరణించారని కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఒక్కరోజులో దాదాపు 55 శాతం మేర కేసులు పెరిగాయని వెల్లడించింది. మంగళవారం నుంచి కరోనా ఉధృతి రోజురోజుకూ రెట్టింపు అవుతూ ఆందోళన కలిగిస్తోంది. మంగళవారంనాడు ఒక్కరోజే 293 మరణాలు నమోదు కాగా గురువారంనాటికి రెట్టింపయ్యాయి. కొత్త కేసుల సంఖ్యలోనూ ఇదే పెరుగుదల నమోదవుతోంది. మార్చి నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.40 లక్షలనుంచి 2.7 లక్షల మేరకు పెరగొచ్చని అంచనావేస్తున్నారు. ఫిబ్రవరి చివర్లో ఆంక్షలు సడలించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. జనవరి చివరిలో రోజుకు 9 వేల ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా ఇప్పుడు రోజులు 6 లక్షలకు పైగానే కేసులు నమోదవడం గమనార్హం.

- Advertisement -

రెట్టింపు సంఖ్యలో పీసీఆర్‌ పరీక్షలు..

కొత్త కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూండటంతో ద.కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పీసీఆర్‌ పరీక్షల కోసం ఆ దేశం 130 కోట్ల డాలర్లను వెచ్చించింది. ప్రస్తుతం రోజుకు పది లక్షల పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తోంది.ప్రస్తుతం అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో ద.కొరియా అగ్రస్థానంలో ఉంది. కాగా మరణాలు మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉంటుంన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశ జనాభాలో 88 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. అలాగే బూస్టర్‌ డోసుల విషయంలోనూ ముందంజలో ఉంది. అందువల్లే కేసుల సంఖ్య ఉధృతంగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది.

భారత్‌లో తగ్గుతున్న ఉధృతి..

నాలుగైదు రోజులుగా దేశంలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండగా గడిచిన మూడు రోజులతో పోలిస్తే గురువారం నాడు కొత్త కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశం మొత్తంమీద 2539 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే దాదాపు 1106 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో 60మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మరణాల సంఖ్యలోనూ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 0.08 శాతం కాగా రికవరీలు 98య72గా నమోదైంది.

అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం..

చైనా, ఇజ్రాయిల్‌ సహా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, వైద్యఆరోగ్యశాఖ సిబ్బందిని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆరోగ్యకార్యకర్తలు, వైద్యసిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది, స్వచ్చంద సంస్థల పాత్ర మరువలేనిదని, అవిశ్రాంతంగా వారు అందించిన సేవలు నిరుపమానమని కేంద్రం ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రశంసించారు. ఇరుగుపొరుగు సహా అనేక దేశాల్లో మళ్లిd కరోనా విజృంభిస్తున్న తరుణంలో వారు ప్రజలను మరింత చైతన్యవంతులను చేస్తూ సేవలు అందించాలని కోరారు. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొని దేశంలో ప్రజారోగ్య పరిరక్షణ ఎలా సాధ్యమైందన్న విషయంపై గురువారం నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement