Wednesday, May 22, 2024

Delhi | రాజ్‌ఘాట్ వద్ద నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్టుపై నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మంగళవారం ఉదయాన్నే మహాత్మ గాంధీ సమాధి రాజ్‌ఘాట్ సందర్శించారు. ఆయనతో పాటు పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కే. రామ్మోహన్ నాయుడు, కేశినేని శ్రీనివాస్ (నాని), కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, మురళీ మోహన్, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావుతో పాటు పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కొనకళ్ల నారాయణ.. చంద్రబాబు అరెస్టుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, మంగళవారం కోర్టులో జరిగే వాదనల అనంతరం న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని తెలిపారు.

చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని వెల్లడించారు. మరికొందరు ఎంపీలు, నేతలు మాట్లాడుతూ.. కేవలం కక్షసాధింపు కోసమే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న అవినీతి మరకు చంద్రబాబు నాయుడుకు కూడా అంటించాలన్న ప్రయత్నం తప్పితే కేసులో అసలేమాత్రం వాస్తవం లేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు నారా లోకేశ్ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌ కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌తో పాటు సోమ, మంగళవారాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి చంద్రబాబు అరెస్టు అంశాన్ని తీసుకెళ్లి జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement