Friday, April 26, 2024

అండమాన్ దీవులకు అమరవీరుల పేర్లు.. పరమవీర చక్ర పొందిన సైనికులకు ఘన నివాళి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ సేవలో ప్రాణాలొడ్డి పోరాడి పరమవీర చక్ర పొందిన సైనికులకు మరో రకంగా ఘన నివాళి అర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అండమాన్ – నికోబార్ దీవుల సముదాయంలో ఇప్పటి వరకు పేరు పెట్టని 21 పెద్ద దీవులకు పరమవీర చక్ర పొందిన సైనికుల పేర్లను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23 (సోమవారం) ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం గం.11.00కు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో నేతాజీ సుబాష్ చంద్రబోస్ దీవిలో నేతాజీ నేషనల్ మెమోరియల్ నిర్మాణానికి పచ్చజెండా ఊపనున్నారు.

ఈ మేరకు మెమోరియల్ నమూనాను మోదీ ఆవిష్కరించనున్నారు. 2018లో రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుబాష్ చంద్రబోస్ దీవిగా పేరు మార్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో నీల్ ఐల్యాండ్ ను షహీద్ ద్వీప్‌ (దీవి)గా, హ్యావ్‌లాగ్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్‌గా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. ఇప్పుడు తాజాగా 21 పెద్ద దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన సైనికాధికారుల పేర్లు పెట్టి సత్కరించాలని కేంద్రం నిర్ణయించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన అమరవీరులకు గుర్తింపునిచ్చే ఉద్దేశంతో పరమవీర చక్ర పొందిన తొలి అధికారి పేరును 21 దీవుల్లో పెద్ద దీవికి పెట్టనున్నారు.

ఆ తర్వాత పొందిన అధికారి పేరును రెండో పెద్ద దీవికి పెడుతూ మొత్తం 21 దీవులకు ఇదే వరుస క్రమాన్ని అనుసరించనున్నారు. ఇలా పరమవీర చక్ర పొందివారిలో మేజర్ సోమ్‌నాథ్ శర్మ, లాన్స్ నాయక్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామ రఘోబ రాణే, నాయక్ జడునాథ్ సింగ్ తదితరులున్నారు. ఇప్పటి వరకు పేరు పెట్టని దీవులకు అమరవీరుల పేర్లు పెట్టడం దేశ ప్రజలు వారి త్యాగానికి ఇచ్చే ఘన నివాళిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement