Saturday, April 20, 2024

ధాన్యం కొనుగోళ్లు పూర్తి.. లేటుగా నాట్లు వేసిన రైతుల ధాన్యం కొనుగోలుకు మరో ఛాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వానాకాలం ధాన్యం సేకరణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముగిసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్నతాధికారులతో కలిసి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి నాట్లు ప్రారంభమైనందున గత వానకాలంలో లేటుగా నాట్లేసిన వారికి సైతం ఈనెల 24 వరకూ ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో 64.30 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణతో 2022-23 వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అక్టోబర్‌ 21న ప్రారంభమైన వానాకాలం పంటసేకరణ మూడు నెలలకు పైగా 94 రోజులు నిరంతరాయంగా నిర్వహించామని వెల్లడించారు.

మారుమూల ప్రాంతాల రైతులు సైతం రవాణా కోసం ఇబ్బంది పడకుండా వారికి అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 7024 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 13,570 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 9లక్షల 76వేల మంది రైతుల నుండి సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ఓపీఎంఎస్‌లో నమోదైన 12,700 కోట్లను చెల్లించామని మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామన్నారు. ధాన్యం సేకరణకు 16 కోట్ల గన్నీలు వాడగా అదనంగా మరో ఐదున్నర కోట్ల గన్నీలు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.

- Advertisement -

అత్యధికంగా నిజామాబాద్‌లో సేకరణ…

ఈ ఏడాది బహిరంగ మార్కెట్లలోనూ అత్యధిక ధర లభించడం సంతోషకర పరిణామమని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ వానాకాలంలో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. కామారెడ్డిలో 4.75, నల్గొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్‌ టటన్నులు సేరకించారు. అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 2264 మెట్రిక్‌ టన్నులు, మేడ్చల్‌లో 14361, ఆసిఫాబాద్‌లో 21548, రంగారెడ్డి 22164, గద్వాలలో 24181 మెట్రిక్‌ టన్నులు సేకరించామని తెలిపారు. ఈ ధాన్యం సీఎంఆర్‌ ప్రక్రియ సైతం వేగంగా నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన రైతులు, హమాలీలు, ప్యాక్స్‌, ఐకేపీ యంత్రాంగం, సివిల్‌ సప్లయీస్‌ అధికారులకు మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌, జాయింట్‌ కమిషనర్‌ ఉషారాణి, జీఎం రాజారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement