Saturday, April 27, 2024

Delhi | నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మారే ప్రసక్తే లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ను వీడుతున్నానంటూ వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలను ఆయన కొట్టిపారేశారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్‌ను, తనను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయవద్దని కోరారు. పార్టీ మారే ఆలోచన ఉంటే తానే ప్రకటిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇతర పార్టీలకు వెళ్లే వాణ్ని అయితే పీసీసీ పదవి ఇవ్వనప్పుడే నిర్ణయం తీసుకునే వాడినని స్పష్టం చేశారు. తాను అధిష్టానంపై కొన్ని కామెంట్లు చేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తన సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామని సోనియా గాంధీ, రాహుల్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు.

అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానిని, కేంద్రమంత్రులను కలుస్తుండడం వల్ల పార్టీ మారుతున్నాననే వార్తలు వచ్చాయని భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవి వదులుకుని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడానని కోమటిరెడ్డి గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రేతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై చర్చించానని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ టికెట్లు గెలిచే అభ్యర్థులకు త్వరగా ఇవ్వాలని కోరానన్నారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కోరానని వివరించారు. పార్టీ మారేది ఉంటే కార్యకర్తలను, తన అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తనది కాంగ్రెస్ రక్తమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో పదవి వస్తుందని ఆశిస్తున్నానే తప్ప, పార్టీని వీడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నొక్కి చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement