Friday, May 10, 2024

మున్నూరు రవి కిడ్నాప్, ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో ఘటన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మున్నూరు రవి ఢిల్లీలో కిడ్నాప్ అయ్యారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రపతి భవన్‌కి కూతవేటు దూరంలో ఉన్న సౌత్ అవెన్యూలో మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన కిడ్నాప్ ఘటనపై జితేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు జితేందర్ రాజ్ సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. గత నెల 26న మరో ఇద్దరితో కలిసి ఢిల్లీ చేరుకున్న మున్నూరు రవి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో ఉంటూ తన పనులు చూసుకుంటున్నారు. సోమవారం రాత్రి 8.00 దాటిన తర్వాత జితేందర్ రెడ్డి నివాసానికి 2 వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు జితేందర్ రెడ్డి నివాసం నుంచి మున్నూరు రవి, అతనితో పాటు వచ్చిన ఇద్దరితో పాటు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను కూడా తమ వెంట తీసుకెళ్లారు.

ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమేరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత నలుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మంగళవారం సాయంత్రం వరకు వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. దీంతో తీసుకెళ్లినవారు కిడ్నాప్ చేశారని నిర్థారణకు వచ్చిన జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది, సౌత్ ఎవెన్యూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. అయితే రాత్రి సమయం కావడం, వచ్చినవారు మాస్కులు ధరించడంతో సీసీటీవీ దృశ్యాల్లో వారిని గుర్తుపట్టడం కష్టంగా మారింది. జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 365 (కిడ్నాప్, దురుద్దేశంతో తమ వెంట తీసుకెళ్లడం, అపహరణ) కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.
 
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సంప్రదించగా.. ఫిబ్రవరి 26న మున్నూరు రవి ఢిల్లీలో తన నివాసానికి వచ్చి తన ఇంట్లో ఉంటానన్నాడని, తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తాను సరేనన్నానని తెలిపారు. అయితే రవి ఎందుకు వచ్చాడో తెలియదని జితేందర్ రెడ్డి చెప్పారు. సోమవారం రాత్రి 2 వాహనాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తన డ్రైవర్ థాపాతో పాటు మున్నూరు రవిని, అతనితోపాటు ఉన్నవారిని తీసుకెళ్లినట్టు వ్యక్తిగత సిబ్బంది చెప్పారని, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించానని ఆయన వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement