Saturday, April 27, 2024

Delhi | మణిపూర్‌ అంశంపై అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్దతు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ బీఆర్‌ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఏఐఎంఐఎం మద్దతు తెలిపింది. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి మణిపూర్ చిచ్చుపై చర్చ చేపట్టాలని రాజ్యసభ, లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఇస్తున్న అవిశ్వాస తీర్మానంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. ఓవైసీతో పాటు బీఆర్‌ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు, డాక్టర్ రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, దయాకర్, శ్రీనివాసరెడ్డి తీర్మానంపై సంతకం చేశారు.

మణిపూర్‌లో చెలరేగిన హింస వల్ల శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, నరమేథం జరుగుతున్నా కేంద్రానికి పట్టకపోవడం దారుణమని నామా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పాటు అనేక కీలక అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని కోరినా కేంద్రం పట్టించుకోకుండా మొండివైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర కుట్రలను పార్లమెంట్ సాక్షిగా ఎండగడతామని నామ నాగేశ్వరరావు హెచ్చరించారు.

- Advertisement -

సీజీతో ఎంపీల భేటీ

ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పార్టీ ఎంపీలతో కలసి లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌ను కలిసి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు దారితీసిన కారణాలు, కేంద్రం వైఖరిని ఆయనకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము ఇచ్చిన ఆవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణనలోకి తీసుకుని ఆమోదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement