Saturday, May 4, 2024

మీ ప్రేమకు దాసోహం.. గోవా సినీ ఉత్సవాల్లో మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి మరొక ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-22 పురస్కారాన్ని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా అందుకున్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి ఈ అవార్డును మెగాస్టార్‌కు ప్రదానం చేశారు. ఈ వేడుకలో సతీసమేతంగా పాల్గొన్న చిరంజీవి, అవార్డు అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమని చెప్పారు. యువ హీరోలు తనకు పోటీ కాదన్న ఆయన, తానే వాళ్లకు పోటీ అని వ్యాఖ్యానించారు.

ఈ అవార్డు నా అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాను. నా చివరి శ్వాస వరకు సినిమా రంగంలో కొనసాగుతాను. నేను ఎల్లప్పుడు మీతోనే ఉంటా.. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా.. మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలోఎక్కడున్నా వారి ప్రేమకు నేను దాసోహం. ఆ ప్రేమే కావాలి. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటా. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు. గతంలో ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నాను. కానీ దక్షిణాదికి చెందిన నటుడి ఫొటో లేదని అప్పుడు బాధపడ్డాను.

కానీ ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు పోయి భారతీయ సినిమా రోజు వచ్చింది అంటూ మెగాస్టార్‌ భావోద్వేగంతో తన స్పందన తెలియజేశారు. శివశంకర్‌ అనే తనకు సినీపరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చిందని, 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానని, రాజకీయాల్లోకి వెళ్లాక సినిమా విలువ తెలిసొచ్చిందని అన్నారు. సినీ పరిశ్రమలో అవినీతికి తావులేదని, ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానమని చిరు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement