Monday, April 29, 2024

Spl Story : మెనూ ఫిక్స్‌..!

  • మధ్యాహ్న భోజన పథకంలో కిచిడి, వెజ్‌ బిర్యానీ
  • ప్రతి రోజు మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ తప్పనిసరి
  • మెనూ మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
  • ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త మెనూ అమలు
  • ధరలు పెంచకుంటే సాధ్యం కాదంటున్న నిర్వాహకులు


మెదక్‌ ప్రతినిధి, (ప్రభ న్యూస్‌) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెనూ మార్చుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ మెనూ అమలు కానుంది. ఈ మేరకు పాఠశాలల ప్రారంభం రోజు నుంచే నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని, దీనిని జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా మెనూలో కిచిడి, వెజ్‌ బిర్యానీని చేర్చడమే కాకుండా ప్రతిరోజు మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ తప్పనిసరిగా పెట్టాల్సిందేనని సూచించింది. అయితే ప్రభుత్వ ఉత్వర్వులపై మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రేట్లతో భోజనం పెట్టలేక అప్పులపాలవుతున్నామని, కొత్త మెనూ అమలు చేయాలంటే విద్యార్థులకు ఇచ్చే రేట్లను పెంచినప్పుడే సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు.

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 598 ప్రాథమిక పాఠశాలలు, 136 ప్రాథమికోన్నత పాఠశాలలు, 151 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 90,022 విద్యార్థులు చదువుతున్నారు. 121 పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిగితా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని గత యేడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కకేంద్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. విద్యార్థులకు ప్రస్తుత మెనూ ప్రకారం భోజనం పెట్టడం వల్ల సరైన పోషకాలు లభించడంలేదని , అది పిల్లల శారీరక, మానసికక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని గుర్తించారు. అంతేకాకుండా బాలికల్లో రక్తహీనత, విటమిన్స్‌ డెఫిషియెన్సీ ఉందని ఈ కారణంగా మెనూ మార్చాలని నిర్ణయించారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) కొత్త మెనూ రూపొందించింది. దీని ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాల్సి ఉంది. పిల్లల్లో పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతున్నాయి. ప్రతి సంవత్సరం సరిపడా నిధులు కేటాయిస్తున్నా ఫలితం ఉండటంలేదు. 15 యేండ్ల లోపు పిల్లలు రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయా ఆరోగ్య నివేదికలు వెళ్లడిస్తున్నాయి. పేదరికంతో నాణ్యమైన భోజనం లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రుచికకరమైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంలో నిర్ల క్ష్యంతోనే వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 21 యేండ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయితే పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలకనుగుణంగా నిర్వాహకులకు ఇచ్చే చార్జీలు పెంచడంలేదు. దీంతో చాలా చోట్ల నీళ్లచారు, నాసీరకమైన భోజనం వడ్డిస్తున్నారు. భోజనం రుచికరంగా లేక మధ్యాహ్నం విద్యార్థులు ఇళ్లబాట పడుతున్నారు. అలాంటి వారిలో కొందరు తిరిగి రాకపోవడంతో పాఠశాలల్లో గైర్హాజరు శాతం పెరుగుతోంది. ఫలితంగా ఉత్తీర్ణతపై ప్రభావం చూపుతోంది. మార్కెట్‌ ధర ప్రకారం కోడిగుడ్డు ధర చెల్లించకపోవడంతో నిర్వాహకులు పథకాన్ని నామమాత్రంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తొంది.

మా వల్ల కాదంటున్న ఏజెన్సీ నిర్వాహకులు…
మధ్యాహ్న భోజనం కోసం ప్రస్తుతం 1-5 తరగతుల విద్యార్థులకు రోజుకు రూ. 5.45 పైసలు, 6-10 తరగతుల విద్యార్థులకు రూ. 8.17 పైసలు ఇస్తున్నారు. ఈ డబ్బులతో పాత మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటేనే ఇబ్బందిగా ఉందని, ఒక కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే ప్రతి విద్యార్థికి రూ. 3 నుంచి 4 వరకు పెంచాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి యేటా 7.5 శాతం మధ్యాహ్నం భోజన ధరలను పెంచాల్సి ఉంటుంది. కానీ కరోనా సమయంలో రెండు సంవత్సరాలకు కలిపి 9.6 శాతం మాత్రమే పెంచారు. ఇక ఈ విద్యా సంవత్సరంకు సంబంధించి ఇప్పటి వరకు ధరలను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించకుండానే కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టడం ఎలా సాధ్యపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. తమ గౌరవ వేతనం రూ.1000 నుంచి రూ. 3వేలకు పెంచుతామని గత సంవత్సరం ప్రకటించినా నేటి వరకు అమలు చేయడంలేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మెనూ పాటించే విధంగా చూస్తాం: డాక్టర్‌ రాధాకిషన్‌ డిఈఓ మెదక్‌ జిల్లా
మధ్యాహ్న భోజనంలో మెనూ మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల ప్రారంభం నుంచే కొత్త మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. కొత్త మెనూ అమలుతో విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందనుంది. రుచికరమైన భోజనంతో అడ్మిషన్ల సంఖ్య పెరగనుంది. అన్ని పాఠశాలల హెడ్‌మాష్టర్లు బాధ్యతగా ఉంటూ కొత్తమెనూ అమలుకు కృషి చేయాలి.

కొత్త మెనూ ఇలా..
సోమవారం : కిచిడి, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, గుడ్డు
మంగళవారం : రైస్‌, సాంబర్‌, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, గుడ్డు
బుధవారం: రైస్‌, పప్పు, ఆకుకూర, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, గుడ్డు
గురువారం: వెజిటెబుల్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ
శుక్రవారం: రైస్‌, సాంబారు, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, గుడ్డు
శనివారం: రైస్‌, పప్పు, ఆకుకూర, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ

Advertisement

తాజా వార్తలు

Advertisement