Sunday, April 28, 2024

Delhi | మాణిక్యం పోయే, మాణిక్ రావు వచ్చె.. బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్ స్థానంలో కొత్తగా మాణిక్ రావ్ ఠాక్రే నియమితులయ్యారు. మాణిక్యం టాగోర్‌కు గోవా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట ప్రకటన విడుదల చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. అంతకంటే ముందు తెలంగాణ బాధ్యతల నుంచి తప్పుకుంటూ మాణిక్యం టాగోర్ కలకలం సృష్టించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల నుంచి ఆయన ఒక్కసారిగా వెళ్లిపోతూ అందరికీ ధన్యవాదాలు అన్న అర్థంతో ఒక మెసేజ్ కూడా పోస్టు చేశారు.

నిజానికి తెలంగాణ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ గత ఏడాది డిసెంబర్లోనే రాహుల్ గాంధీకి చెప్పినట్టు తెలిసింది. పార్టీ సీనియర్లు అటు రేవంత్, ఇటు మాణిక్యం టాగోర్ లక్ష్యంగా అధిష్టానం పెద్దలకు వరుసగా ఫిర్యాదులు చేయడంతో కొంత అసహనానికి గురైన టాగోర్, అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తనకు మరేదైనా రాష్ట్రం అప్పగించాలని కూడా అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెలలో ఏఐసీసీ దూతగా దిగ్విజయ్ సింగ్‌ను పంపించి సీనియర్లకు, రేవంత్ వర్గానికి మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించే ప్రయత్నం అధిష్టానం చేసింది. దిగ్విజయ్ పర్యటన అనంతరం అధిష్టానానికి ఒక నివేదకను కూడా సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా అధిష్టానం మార్పులు చేపట్టినట్టు తెలిసింది.

కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న మాణిక్ రావ్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత. 1954 ఆగస్టు 22న జన్మించిన ఆయన మహారాష్ట్ర దార్వా నియోజకవర్గం నుంచి వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర కేబినెట్‌లో కీలకమైన హోంశాఖతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ వంటి శాఖలకు మంత్రిగానూ పనిచేశారు. 2009 నుంచి 2018 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా 2008 నుంచి 2015 వరకు సుదీర్ఘకాలం పనిచేసిన ఠాక్రే బీజేపీ-శివసేనలపై తీవ్ర విమర్శలు చేయడంలో దిట్టగా పేరొందారు. ఆయనకు పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఏఐసీసీ బాధ్యతలు అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement