Friday, March 29, 2024

Delhi | తిరుపతి రోప్-వే సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం.. వెల్ల‌డించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుపతి-తిరుమల మధ్య రోప్ వే సాధ్యాసాధ్యాలపై త్వరలో అధ్యయనం ప్రారంభం కానుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థను ఆదేశించినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 10 రోప్ వే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది.

ఈ క్రమంలో తిరుపతి – తిరుమల మధ్య రోప్ వే ప్రాజెక్ట్ సాధ్యపడితే శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం తిరుమల కొండకు వచ్చే భక్తులకు సదుపాయంతో పాటు అద్భుతమైన అనుభూతి కూడా కల్గుతుంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ మధ్య నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అథారిటీ సీఈఓ ప్రకాశ్ గౌర్‌తో సమావేశమై తిరుపతి రోప్ వే ప్రాజెక్టు గురించి చర్చించిన విషయం తెలిసిందే.

తిరుపతితో పాటు చెన్నై (తమిళనాడు), మాథేరన్ (మహారాష్ట్ర), ప్రయాగ్‌రాజ్ (ఉత్తర్ ప్రదేశ్), బృందావన్ (ఉత్తర్ ప్రదేశ్), దుగ్ధధార-కపిల్‌ధార్ (మధ్యప్రదేశ్), ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం (మధ్యప్రదేశ్), సబర్మతి రివర్ ఫ్రంట్ – అహ్మదాబాద్ (గుజరాత్), రాయ్‌గఢ్ ఫోర్ట్ (మహారాష్ట్ర)లో రోప్ వే నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో తిరుపతి-తిరుమల 4 కి.మీ మేర నిర్మించాలని భావిస్తున్న రోప్ వే ప్రాజెక్టుపై స్థానిక తిరుపతి ఎంపీ (వైఎస్సార్సీపీ) గురుమూర్తి ఎప్పటికప్పుడు అధికారులను కలుస్తూ పురోగతిని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే తిరుపతి రోప్ వే ప్రాజెక్టుపై అధ్యయనం మొదలవుతుందని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement