Wednesday, May 1, 2024

అభివృద్ధి ప్రాజెక్టులకు జోరుగా రుణాలు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 4వేల కోట్లతో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు

రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తెలంగాణ అర్బన్‌ ఫైనాన్సింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీయూ ఎఫ్‌ఐడీసీ) దన్నుగా నిలుస్తోంది. 2014లో ఏర్పడ్డ ఈ అర్బన్‌ ఫైనాన్సింగ్‌ సంస్థ రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు అభివృద్ధి ప్రాజెక్టులకుగాను నిధులు సమకూరుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీలను సమూలంగా మార్చివేసి అభివృద్ధి పధంలో నడిపే పనిలో టీయూఎఫ్‌ఐడీసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. నిజామాబాద్‌లో సివరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం, బాన్సువాడలో బండ్‌ పునర్‌నిర్మాణం, మరిపెడలో స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్రా, నర్సంపేటలో మీడియన్‌ వీధి దీపాలు, గ్రీనరీ ఇలా చెప్పుకుంటూ పోతే టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల జాబితా భారీగా ఉంటుందని అర్వింద్‌కుమార్‌ పేర్కొన్నారు.

మునిసిపాలిటీల సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ మార్గాల ద్వారా సమకూరే నిధుల ఆధారంగా టీయూఎఫ్‌ఐడీసీ మునిసిపాలిటీలకు రుణాలు సమకూరుస్తుంది. ఇందుకుగాను టీయూఎఫ్‌ఐడీసీ ఆయా మునిసిపాలిటీల నుంచి ప్రాజెక్టులకుసంబంధించిన సమగ్ర నివేదిక తీసుకుంటుంది. టీయూఎఫ్‌ఐడీసీ ఇచ్చే రుణాల ద్వారా మునిసిపాలిటీలకు పెట్టుబడి వ్యయాలకు సంబంధించి ఢోకా లేకుండా పోతోందని, వనరుల కొరత వల్ల అభివృద్ధి పనులు ఆగిపోకుండా కలిసి వస్తోంది. టీయూఎఫ్‌ఐడీసీకి మూలధనాన్ని ప్రభుత్వమే సమకూర్చగా ఈ మూలధనానికి కొన్ని రెట్లు అధికంగా ఎఫ్‌ఐడీసీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటోంది. ఈ రుణాలను తిరిగి సంస్థ మునిసిపాలిటీలకు ఫైనాన్సింగ్‌ చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

కాగా, తెలంగాణలోని మున్సిపాలిటీల ఆర్థిక స్థితి రోజురోజుకు మెరుగుపడుతోంది. రోజురోజుకు మున్సిపాలిటీల్లో పెరుగుతున్న ఆస్తుల సంఖ్యతో ఆస్తిపన్ను వసూళ్లతో పాటు వివిధ రకాల ఫీజుల రాక కూడా పెరుగుతుండడంతోనే వాటి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని చాలా వరకు మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు వాటి ఆర్థిక పరిస్థితి సూచించే విధంగా పలు రేటింగ్‌ ఏజెన్సీలు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికల ప్రకారం ఆయా మున్సిపాలిటీల ఆర్థిక స్థితి బాగున్నట్లు స్పష్టమైంది. రేటింగ్‌ ఏజెన్సీల నుంచి నివేదిక పొందిన మున్సిపాలిటీల్లో సుమారు అన్నిటికి బీబీబీ ప్లస్‌, బీబీ ప్లస్‌ రేటింగ్‌ లు వచ్చినట్లు అధికారులు చెెబుతున్నారు. దీంతో ఈ మున్సిపాలిటీలకు భారీగా అప్పులు పుట్టునున్నట్లు తెలుస్తోంది. ఓపెన్‌ మార్కెట్‌ బాండ్లు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి సేకరించనున్న ఈ అప్పులతో భవిష్యత్తులో ఆయా పురపాలికలు భారీ అభివృద్ధి ప్రాకెక్టులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement