Thursday, May 2, 2024

కిక్కిరిసిపోతున్న నగరంలోని లైబ్రరీలు.. పుస్తకాలతో కుస్తీపడుతున్న అభ్యర్థులు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1, యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడడంతో వేలాది మంది అభ్యర్థులతో లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ సెంట్రల్‌ లైబ్రరీలతో పాటు నగరంలోని ఇతర పబ్లిక్‌ లైబ్రరీలు సైతం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 503 పోస్టులకు గ్రూప్‌-1, 17,291 యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌ నగరంలోని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అవకాశం ఉన్న వారు కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకుంటుంటే, లేని వారు మాత్రం గ్రంథాలయాల్లో చదువుకుంటున్నారు. తమ దగ్గర వున్న పుస్తకాలతోపాటు గ్రంథాలయాల్లో ఉన్న పుస్తాకాలతో ఉద్యోగానికి కుస్తీపడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా కష్టపడి చదివి కొలువెలాగైనా కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈక్రమంలోనే ఉదయాన్నే లైబ్రరీలకు చేరుకుని పోటీ పరీక్షల సిలబస్‌కు తగిన పుస్తకాలు తీసుకుని సిద్ధమవుతున్నారు.

ఉస్మానియా గ్రంథాలయం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులోనే ఉంటుంది. నగర వ్యాప్తంగా దాదాపు 86 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని లైబ్రరీల్లో అప్డేట్‌ పుస్తకాలు లేకపోవడంతో ఉద్యోగార్థులు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. చిక్కడిపల్లి లైబ్రరీల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటోంది. అక్కడ అభ్యర్థులే ఎవరి కుర్చీలు వారే తెచ్చుకుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆ కుర్చీని గొలుసుతో అక్కడ ఉండే చెట్లకు, ఐరన్‌ పోల్స్‌కు కట్టేసి వెళ్తున్నారు. భారీ సంఖ్యలో చదువుకునేందుకు వచ్చే అభ్యర్థులకు సరిపడా కర్చీలు కూడా గ్రంథాలయాల్లో ఉండడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సరైనా వసతులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. చిక్కడపల్లిలోని సెంట్రల్‌ లైబ్రరీకి నిత్యం 2 వేల మంది వరకు విజిటర్స్‌ వస్తుంటారు.

దాంతో చెట్ల కిందనే కూర్చొని చదువుకుంటున్నారు. గ్రంథాలయాల్లో కూర్చునేందుకు సరిపడా కర్చీలు లేకపోవడం అక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల మధ్యే అభ్యర్థులు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి లైబ్రరీలోనూ వచ్చే అభ్యర్థులకు సరిపడా సీటింగ్‌ కెపాసిటీ ఉండడంలేదని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. ఫ్యాన్‌ సౌకర్యం, వాషింగ్‌ రూమ్‌లు సరిగా ఉండడంలేదని పేర్కొంటున్నారు. ఇంటర్నెట్‌పైన ఆధారపడి చదువుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం ఈ-లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి నాగరాజు కోరారు. ప్రతి లైబ్రరీలో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలన్నారు. ఉన్న ఫండ్స్‌తోనే లైబ్రరీలను నెట్టుకొస్తున్న పరిస్థితి ఉందని, కొత్తగా ఫండ్స్‌ రావడంలేదన్నారు. నిత్యం 2వేలకు పైగా విజిటర్స్‌ వచ్చే హైదరాబాద్‌ నగరంలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీయే ఇలా ఉంటే జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఉండే లైబ్రరీల పరిస్థితి ఇంకాల ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement