Monday, May 6, 2024

Breaking: కేసీఆర్ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తా.. రేవంత్ రెడ్డి

కేసీఆర్ అధికారంలోకి వస్తా అంటున్నారు.. ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తానని.. తాను ఇక్కడే ఉంటానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారు, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని గత ప్రభుత్వానికి ఆలోచన రాలేదని విమర్శించారు. తమది ప్రజా ప్రభుత్వమని.. యువత ఎలాంటి ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు.

ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేశామని గుర్తు చేశారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుండి గట్టెక్కిస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే అధికారులతో సమీక్షించి ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు తొలగించామని పేర్కొన్నారు.

తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు లేకపోతే కేసీఆర్ 100 రోజులు కూడా ఆగలేదని.. వెంటనే తన కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇచ్చాడని విమర్శించారు. మరీ తెలంగాణ యువత ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని ఓ అటెండర్ చెప్పారన్నారు. కేసీఆర్ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు. కొత్తగా ఎంపికైన ఈ పోలీసులే కేసీఆర్‌ను తీసుకెళ్లి లాకప్‌లో వేస్తారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement