Sunday, May 5, 2024

Kushi Collections | రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో ‘ఖుషి’ !

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ- సమంతల లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ డే రూ.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా రూ.20 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. వీకెండ్ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. గ‌త సినిమ‌ల డిజాస్ట‌ర్ల నుంచి ఇద్ద‌రూ హీరో, హీరోయిన్ లు గ‌ట్టి క‌మ్ బ్యాక్ ఇచ్చార‌నే అంటున్నారు సినీ విశ్లేష‌కులు.

ఇక‌, ఖుషి సూపర్ హిట్ సాధించడంతో మూవీ టీమ్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. విజయ్ దేవరకొండతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, చిత్రయూనిట్ కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వారిని అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అయితే ద‌ర్శ‌నం అనంత‌రం విజయ్ దేవరకొండ నేరుగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కి వెళ్లి ఫ్యాన్స్ కలిసి సినిమా వీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ తెరకెక్కించిన ఈ మూవీలో ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, స‌చిన్ ఖ‌డేక‌ర్‌, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ సంగీతాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement