Thursday, May 2, 2024

హస్తినలో కేసీఆర్ మంత్రాంగం.. పార్టీ ఎంపీలతో మధ్యాహ్నం విందు సమావేశం

న్యూఢిల్లీ, ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు మంగళవారం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం విందు సమావేశం నిర్వహించిన కేసీఆర్, వారితో అనేకాంశాలపై చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో పాల్గొనడంతో పాటు తెలంగాణకు సంబంధించిన అంశాలపై కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టడం వంటి అంశాలపై చర్చించినట్టు తెలిసింది. మంగళవారం రాజ్యసభలో సస్పెండ్ చేసిన 19 మంది ప్రతిపక్ష ఎంపీల్లో ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులున్న విషయం తెలిసిందే. వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్‌ సస్పెండైన వారిలో ఉన్నారు. ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రితో చర్చ జరిగినట్టు తెలిసింది. సస్పెన్షన్లకు వెరవకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను, అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ఆందోళన మరింత తీవ్రతరం చేయాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించినట్టు సమాచారం. పార్లమెంటు ఉభయ సభలు జరిగినా, జరగకపోయినా టీఆర్ఎస్ ఎంపీలు తమ వాణి బలంగా వినిపించాలని, అందివచ్చిన అన్ని అవకాశాలనూ వినియోగించాలని మార్గదర్శనం చేసినట్టు తెలిసింది.

ఇదిలా ఉంటే, ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వ పెద్దలెవరినీ కలవలేదు. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరే ముందు నుంచే చర్చ జరిగింది. అలాగే రాష్ట్రంలో తాజాగా తలెత్తిన వరదలు, జరిగిన నష్టంపై కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించి ఆర్థిక సహాయం కోరతారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఢిల్లీలో కేసీఆర్ వ్యవహారాలు చూసుకునే సిబ్బంది మాత్రం ఇప్పటివరకు ఎవరితోనూ అపాయింట్మెంట్ తీసుకోలేదని వెల్లడించారు.

మరోవైపు జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్, ఆ దిశగా మేధోమథనం చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు, నిపుణులు ఢిల్లీలో ఆయన్ను కలిసినట్టు సమాచారం. జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకించే రాజకీయ, రాజకీయేతర శక్తులు స్వయంగా కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసివెళ్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో బుధవారం కూడా మరికొందరు ప్రముఖులు కేసీఆర్‌తో భేటీకానున్నట్టు సమాచారం. దేశ ఆర్థిక స్థితిగతులు, రక్షణ రంగంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ రెండు రంగాలకు చెందిన నిపుణులు కొందరు కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీల నేతలతోనూ కేసీఆర్ భేటీకానున్నట్టు సమాచారం. అయితే సీఎం కార్యాలయ వర్గాల నుంచిగానీ, పార్టీ కార్యాలయ వర్గాల నుంచి అధికారికంగా ఢిల్లీ పర్యటనపై ఎలాంటి వివరాలు వెల్లడి చేయలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement