Monday, April 29, 2024

Delhi | హస్తినలో జనసేనాని.. బీజేపీ పెద్దలతో భేటీకి నిరీక్షణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తలమునకలైన తరుణంలో ఆ పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ హస్తిన యాత్ర చేపట్టారు. ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకున్న ఆయన, సోమవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్‌తో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వి. మురళీధరన్‌ను కలిశారు. నిజానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, బీజేపీలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని జనసేనాని భావిస్తున్నారు. అయితే జేపీ నడ్డా సోమవారం ఢిల్లీలోనే ఉన్నప్పటికీ జనసేన అధినేతకు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. అమిత్ షా అపాయింట్మెంట్ విషయంలోనూ స్పష్టత లేదు. అయితే సాయంత్రం గం. 4.30 సమయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వి. మురళీధరన్‌ను ఆయన నివాసంలో కలిశారు. గంటకు పైగా ఆయనతో వివిధాంశాలపై చర్చించారు. అనంతరం అక్కణ్ణుంచి బయటకు వెళ్తూ తాను ఇంకా మరికొంత మందిని కలుస్తానని, కలిసిన తర్వాత ఒకేసారి అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

బీజేపీ స్టేట్ యూనిట్‌పై గుర్రు

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్‌తో జరిగిన సమావేశంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ గురించి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర నేతల తీరు కారణంగా బీజేపీ-జనసేన మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లోపిస్తోందని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు పార్టీల మధ్య సమన్వయం లేకపోతే సమస్యలు పెరుగుతాయని చెప్పినట్టు సమాచారం. జాతీయ నాయకత్వం దృష్టి సారించి బీజేపీ-జనసేన సమన్వయంతో, ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లేలా చూడాలని చెప్పినట్టుగా తెలిసింది.

కర్ణాటక ఎన్నికల ప్రచారం!

- Advertisement -

కర్ణాటక ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో జనసేనాని ఢిల్లీ చేరుకోవడంతో బీజేపీ అధిష్టానమే ఢిల్లీకి పిలిపించింది అన్న ప్రచారం జరిగింది. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలతో పాటు కన్నడ ప్రజల్లోనూ క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేస్తే బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, అందుకే పవన్ ను ఢిల్లీకి పిలిపించారని చర్చ జరిగింది. ఢిల్లీలోని కన్నడ మీడియా వర్గాలు సైతం ఈ విషయంపై ఆసక్తిని ప్రదర్శించాయి. కోలార్, బళ్లారి, రాయ్‌చూర్, బీదర్ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న ఊహాగానాలు సైతం వినిపించాయి. అయితే ఈ విషయంపై అటు బీజేపీ, ఇటు జనసేన నుంచి ఎలాంటి స్పష్టత లేదు.

తెలుగుదేశంతో పొత్తు!

మరోవైపు తెలుగుదేశంతో బీజేపీ-జనసేన కూటమి పొత్తు పెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, ఈ విషయం గురించి మాట్లాడ్డం కోసమే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారని చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఏమాత్రం సుముఖంగా లేని బీజేపీ అధిష్టానం ఈ విషయంపై చర్చకు సైతం ఇష్టపడడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే పెద్ద నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మురళీధరన్‌ను కలవాల్సిందిగా సూచించారని, ఆ తర్వాత అవసరం అనుకుంటేనే అపాయింట్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై జనసేన వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించలేదు. అయితే జేపీ నడ్డా, అమిత్ షాలను కలవడం కోసం మంగళవారం కూడా జనసేనాని ఢిల్లీలోనే ఉంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement