Friday, April 26, 2024

ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలి.. పీపీఏ, ఏపీ సర్కారుకు కేంద్ర జల సంఘం ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు ముంపుపై వెంటనే సర్వే చేపట్టాలంటూ కేంద్ర జల సంఘం ఆదేశించింది. అధ్యయనం పేరుతో కాలయాపన చేయకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ సర్వేను పూర్తిచేయాలంటూ సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు, తద్వారా తలెత్తే ముంపు సమస్య సహా అనేక ఇతర సాంకేతికాంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా కేంద్ర జల సంఘం ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. తాజాగా కేంద్ర జల సంఘం ఛైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సోమవారం జరిగిన తాజా సమావేశంలో ప్రాజెక్టు ముంపు గురించి సర్వే జరిపించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టింది. సర్వే జరిపే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంబద్ధమైన వాదనలతో తాత్సారం చేస్తోందని తెలంగాణ మండిపడింది.

వీటితో పాటు సమావేశంలో మరికొన్ని డిమాండ్లను కేంద్ర జల సంఘం ముందుంచింది. పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (ఎఫ్.ఆర్.ఎల్)లో నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ఏర్పడుతున్న ముంపును గుర్తించాలని, అలాగే డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలు సహా 2022 జులై నెలలో తలెత్తిన వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలని డిమాండ్ చేసింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలంతో పాటు మణుగూరు భార జల కేంద్రం రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది. కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలియజేసింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడు వాగు నదులపై పడే ప్రభావాన్ని సైతం గుర్తించాలని సీడబ్ల్యూసీని కోరింది. రానున్న రుతుపవనాలు, వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఆలోగా సర్వే పూర్తిచేసేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఏదైనా ఏజెన్సీతో కలిసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ జాయింట్ సర్వే చేపట్టేలా చూడాలని సూచించింది.

- Advertisement -

నిజానికి ఈ ఏడాది జనవరి 25న జరిగిన 2వ సమావేశంలోనే ఈ ఉమ్మడి సర్వే చేపట్టాలంటూ అటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఏ కాస్త పురోగతి కూడా లేకపోవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేంద్ర రావు, చీఫ్ ఇంజనీర్ కొత్తగూడెం శ్రీనివాసరెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే, తెలంగాణ ఇంటర్ స్టేట్ బోర్డు గోదావరి డైరక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ ఒడిశా ఈఎన్సీ అశుతోష్ దాస్, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement