Tuesday, May 14, 2024

Delhi | జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. స్పష్టం చేసిన లా కమిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావని లా కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. 2024లో జమిలి ఎన్నికలు ఉండబోవని వెల్లడించాయి. రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కమిషన్ అభిప్రాయపడింది. గత బుధవారం జమిలి ఎన్నికలపై లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించిన కమిషన్ ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేసింది. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై కూడా చర్చించింది.

జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావించింది. తరచూ ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని లా కమిషన్ భావిస్తోంది. జమిలి అంశాలపై లోతుగా, సుదీర్ఘంగా చర్చించి వివిధ సిఫార్సులతో కూడిన 22వ నివేదికను కేంద్రానికి అందించనుంది. ఆమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 85, 172, 174, 356లో సవరణలపై కసరత్తు చేస్తోంది.

- Advertisement -

జమిలి ఎన్నికల కోసం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణలపై నివేదికలో సూచనలిస్తామని శుక్రవారం లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థీ స్పష్టం చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. జమిలి ఎన్నికలపై 2022 డిసెంబర్‌లోనే లా కమిషన్ ఆరు ప్రశ్నలతో అభిప్రాయ సేకరణ చేపట్టింది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాన్నీ తీసుకుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement