Saturday, May 4, 2024

Delhi | పోలవరాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన జగన్.. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి జగన్ ప్రభుత్వం చట్టం చేయబోతోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ చెప్పారు. అన్యాక్రాంతం అయిన భూములు కబ్జాదారులకు చెందేలా చట్టం చేయబోతున్నారని అన్నారు. శనివారం వెంకట్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ, విజయవాడ, గుంటూరులో అసైన్డ్ భూములు కాజేయడానికి జగన్ పథకం వేస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి తెస్తున్న చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

అభివృద్ధి పేరుతో తెలంగాణాలో హైదరాబాద్ లో పేదల నుంచి అన్యాయంగా లాగేసుకుంటున్నారన్న వెంకట్, భూరక్షణ ఉద్యమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అసైన్డ్ భూములు తీసుకోవడం వల్ల దళితులు, పేదలకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అర్ధాన్ని మార్చేస్తోందని విమర్శించారు. పోలవరానికి నిర్మాణ వ్యయం ఇస్తాం, పునరావాసం ఇవ్వబోమని కేంద్రం అంటోందన్న ఆయన, కేసుల కోసం జగన్ కేంద్రానికి సరెండర్ అయ్యి పోలవరాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

లక్ష మంది ప్రజలకు రూ. 34 వేల కోట్ల పునరావాస ప్యాకేజి ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా నిర్వాసిత కుటుంబానికే ఇస్తామంటున్నారని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముంపు బాధితులకు పునరావాస నిధులు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పునరావాసం నిధులు కేంద్రం పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సీపీఐ(ఎం) పాదయాత్ర నిర్వహించిందని, ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సమయం వస్తుందని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement