Friday, May 17, 2024

Big Story | నల్లమలలో ఎత్తిపోతల ప్రాజెక్టు.. అచ్చంపేట లిఫ్ట్‌కు త్వరలో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దట్టమైన నల్లమల అడవి పరిధిలోని ఎత్తయిన ప్రాంతాలు సస్యశ్యామలమయ్యే సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నల్లమల పరిసరాల్లో పర్యటించి ప్రజల కన్నీటి గాధలతో చలించిన నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకష్టాలు తీర్చి కన్నీరు తుడిచేందుకు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎలాంటి సాగునీటి వసతులు లేని నల్లమల అడవి ప్రాంతాల్లోని జనవాసాలకు తాగునీరు, నోళ్లు తెరుచుకుని దాహంతో తల్లడిల్లుతున్న బీడుభూములకు సాగునీరు అందించేందుకు అచ్చంపేట రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టి నిర్మాణ పనులకోసం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులువేస్తూ డీపీఆర్‌ ను సిద్ధం చేయడంతో నల్లమలప్రాంతాల్లోని రైతులు, ప్రజాప్రతినిధులు ఆనందంతో అడుగులు వేస్తున్నారు. చిగురించిన ఆశలతో రైతులు సీఎంకేసీఆర్‌ కు కృతజ్ఞతలతో క్షీరాభిషేకాలు నిత్యకృత్యాలయ్యాయి. నల్లమల ప్రాంతాల్లోని బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు 2021ఏఫ్రిల్‌ లోనే అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. సర్వేపనులు పూర్తి చేసి డీపీఆర్‌ ను సిద్ధం చేశారు. సాంకేతికపరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం సాధించి ఇటీవల సీఎం కేసీఆర్‌ ఈ ఎత్తిపోతల పథకానికి జీఓ ఇచ్చారు.

- Advertisement -

టెండర్ల ప్రక్రియ దాదపుగా పూర్తి చేసుకుని శంకుస్థాపనకు సిద్ధమైంది. జూలై లో సీఎం మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా అచ్చంపేట రిజర్వాయర్‌ కు శంకుస్థాపన చేయనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. నల్లమమల అడవుల్లో ఎత్తయిన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఐదు మండలాల వ్యవసాయభూములకు నీరు అందించెందుకు రెండుదశల్లో నీటిని ఎత్తిపోసే విధంగా డీపీఆర్‌ ను రూపొందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల నుంచి ఉమామహేశ్వరం ఎత్తిపోసి ఆనీటిని అచ్చంపేట రిజర్వాయర్‌ కు లిఫ్ట్‌ చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 61 గ్రామాలకు తాగునీరు, 57వేల 200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల అడవి పరిధిలోని ప్రజల కష్టాలకు కరిగి రూపొందించిన ఈ ప్రాజెక్టునిర్మాణానికి రూ. వేయి 534కోట్ల 50లక్షలకు పరిపాలనా పరమైన అనుతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అచ్చంపేట నియోజకవర్గంలో 29వేల 328 ఎకరాలు, బల్మూరులో 18వేల 122 ఎకరాలు, లింగాల మండలంలో 4వేల 873 ఎకరాలు, ఉప్పునుంతలలో వేయి 128 ఎకరాలు అచ్చంపేట ఎత్తిపోతలతో సాగునీరు ప్రవహించనుంది. ఈమేరకు భూసేకరణ వేగంగా జరుగుతుంది. ప్రాజెక్టుకోసం రైతులు సహకరిస్తున్నారు. అయితే ఇంకా 4వేల 142 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరగుతోంది : జలవనరుల అభివృద్ధి సంస్థ ఎండీ. అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌

అచ్చంపేట ఎత్తిపోతల పథకంతో వర్షాలపై ఆధారపడిన రైతులు రిజర్వాయర్‌ నీళ్లతో రెండుపంటలు పండించే అవకాశాలు ఉన్నయని జలవనరుల అభివృద్ధి సంస్థ ఎండీ అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారని తెలిపారు. టెండర్ల ప్రక్రియ త్వరలో పూర్తి చేసి నిర్మాణం వైపు ప్రభుత్వం దృష్టి సారించనుందన్నారు. రెండుదశల్లో నీటిని ఎత్తిపోసి ఎగువప్రాంతాల సాగు భూములకు నీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అచ్చంపేట నియోజకవర్గంలోని ఎత్తులోని బీడుభూముల్లో ఈ ప్రాజెక్టుతో సిరులు పండుతాయనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. సంవత్సరంలోగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా లింగాల, ఉప్పునుంతల, బల్మూరు, అచ్చంపేట లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కనున్నాయన్నారు. భూసేకరణ త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారని చెపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement