Sunday, May 19, 2024

కరెంట్‌ బంద్‌.. ఆహారం బంద్‌… ఇంధనం బంద్‌..! ఇజ్రాయెల్‌ సంపూర్ణ ముట్టడిలో గాజా

జెరూసలెమ్‌: గాజాపై సంపూర్ణ ముట్టడికి ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోయావ్‌ గెలాంట్‌ సోమవారం ఆదేశించారు. గాజాకు విద్యుత్తు, ఆహారం, ఇంధన సరఫరా పూర్తిగా నిలిపివేయాలని టెలివిజన్‌ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ”అనాగరికులతో మేం పోరాడుతున్నాం. వాళ్ళకు తగ్గట్టుగానే మేం స్పందిస్తాం” అని తెలిపారు. గాజా గగనతలాన్ని, సముద్ర తీరాన్ని ఇజ్రాయెల్‌ తన నియంత్రణలోకి తెచ్చుకుంది. సరిహద్దు వద్ద మనుష్యులు, సరుకుల రాకపోకలపై ఆంక్షలు విధించింది. అదే విధంగా గాజాతో పంచుకునే సరిహద్దు వద్ద ఈజిప్ట్‌ సైతం ఆంక్షలు విధించింది.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు దీటుగా దక్షిణ ఇజ్రాయెల్‌ నగరాలైన అష్‌దోద్‌, అష్‌ కెలోన్‌ నగరాల వైపు 120 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్‌ సోమవారం పేర్కొంది. ఫలితంగా జెరూసలెమ్‌, టెల్‌ అవివ్‌ నగరాల్లో సైతం సైరన్లు మోగించారు. ఇజ్రాయెల్‌ అత్యవసర సేవల ప్రకారం గాజాకు ఉత్తరాన ఉన్న అష్‌కెలోన్‌లో నలుగురు గాయపడగా, అష్‌దోద్‌లో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. పాలస్తీనా ఆరోగ్య అథారిటీల ప్రకారం సోమవారంనాటికి గాజాలో 560 మంది మరణించగా 2,751 మంది గాయపడ్డారు.

- Advertisement -

మరణించినవారిలో 91 మంది పిల్లలు, 61 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో 244 మంది పిలల్లు, 151 మంది మహిళలు ఉన్నారు. తమ దేశంలో మరణాల సంఖ్య 800 దాటిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌, గాజా మధ్య మూడ్రోజులుగా కొనసాగుతున్న దాడులతో గాజాలో మొత్తంగా 17,500 కుటుంబాలకు చెందిన 1,23,538 మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఏజెన్సీలు పేర్కొన్నాయి. గాజాలో 20,30,000 పాలస్తనీయులు నివసిస్తున్నారు.

గాజా సొరంగాల్లో 100 మందికిపైగా ఇజ్రాయెల్‌ బందీలు

గాజా: ఉన్నత స్థాయి సైనిక అధికారులతో పాటుగా 100 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులను గాజాలోని సొరంగాల్లో బందీలుగా ఉంచినట్టు హమాస్‌ పేర్కొంది. హమాస్‌ రాజకీయ విభాగం డిప్యూటీ చీఫ్‌ మూసా అబూ మెర్‌జూక్‌ అరబిక్‌ టీవీ న్యూస్‌ చానెల్‌ అల్‌-ఘడ్‌ టీవీకి ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బందీలను లెక్కపెట్టలేదు కానీ వారి సంఖ్య వందకు పైనే ఉంటుందని తెలిపారు.

పాలస్తీనా టెర్రరిస్టుల మూక ఇస్లామిక్‌ జిహాద్‌ సైతం 30 మంది ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా చేసుకున్నట్టు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ కారాగారాల్లో మగ్గుతున్న తమవారిని విడుదల చేసేంతవరకు తమ వద్ద ఉన్న బందీలను వదిలిపెట్టేది లేదని ఇస్లామిక్‌ జిహాద్‌ సెక్రటరీ జనరల్‌ జియాద్‌ అల్‌ నఖాలా తెలిపారు. ఒక మహిళతో పాటుగా ఇద్దరు మెక్సికో జాతీయులను హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారని మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి అలిష బర్సెనా చెప్పారు. తమ దేశానికి చెందిన ముగ్గురు పౌరులు సైతం కనిపించకుండాపోయారని బ్రెజిల్‌ అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా యుద్ధ నౌకలు, జెట్‌ విమానాలు

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్రానికి విమాన వాహక నౌక, యుద్ధ నౌకలు, జెట్‌ విమానాలను పంపించినట్టు అమెరికా డిఫెన్స్‌ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. ”ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును పునరుద్ఘాటిస్తున్నట్టుగా ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రితో నేనిప్పుడే మాట్లాడాను. ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలకు(ఐడీఎఫ్‌) అత్యవసర సాయంగా ఇజ్రాయెల్‌కు మార్గమధ్యంలో ఉన్న సైనిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర వనరులను గురిచి తెలియపరిచాను” అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement