Friday, April 26, 2024

రేవంత్ చెబితేనే పెట్టుబడి పెట్టా.. ఈడీ ముందు ఇదే విషయం చెప్పా: అంజన్ కుమార్ యాదవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబితేనే తాను ‘యంగ్ ఇండియన్ లిమిటెడ్’ సంస్థలో పెట్టుబడులు పెట్టానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో చోటుచేసుకున్న మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ఇతర నేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ‘యంగ్ ఇండియన్ లిమిటెడ్’ (వైఐఎల్) సంస్థ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మొత్తం ఆస్తులను అక్రమమార్గాల్లో చేజిక్కించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ‘యంగ్ ఇండియన్ లిమిటెడ్’ సంస్థలో పెట్టుబడులు పెట్టినవారిని ఈడీ పిలిపించి ప్రశ్నిస్తోంది. పెట్టుబడులను విరాళాలుగా నేతలు పేర్కొంటున్నారు. అంజన్ కుమార్ యాదవ్ సైతం ఇదే విషయం చెప్పారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడి సూచన మేరకు తాను స్వచ్ఛందంగా రూ. 20 లక్షలు అందజేశానని చెప్పారు. పార్టీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పడంతోనే తాను ఈ విరాళం అందించానని వెల్లడించారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు తాను ఇదే సమాధానం ఇచ్చానని, మళ్లీ అవసరమైతే పిలుస్తామంటూ ఈడీ అధికారులు చెప్పారని ఆయనన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా విచారణ పేరుతో ఈడీ వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement