Monday, May 6, 2024

భారత్‌ – పాక్‌ సమరం.. రేపే దాయాదుల పోరు..

భారత మహిళా క్రికెటర్లు మరొక అంతర్జాతీయ టైటిల్‌పై కన్నేశారు. ఇంతకాలం అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం కదన రంగంలోకి దిగుతున్నారు. న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఆరంభ మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడేందుకు సిద్ధమయ్యారు. కేప్‌టౌన్‌ మైదానంలో నేడు దాయాదుల మధ్య కీలకపోరు జరగనుంది. ఇండియా-పాకిస్తాన్‌ క్రికెట్‌ అంటేనే ప్రత్యేక ఆకర్షణ. భావోద్వేగాలు, హైడ్రామాతో మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుంది. ఆసియా కప్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత మహిళలు ఉన్నారు. భారీ స్కోర్లతో దీటైన జవాబివ్వాలని చూస్తున్నారు.

గత ఐదేళ్లలో ఇరుజట్ల మధ్య అంతరం ఎక్కువగా ఉన్నది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఆధిపత్యాన్ని సవాల్‌ చేసిన భారత మహిళలకు పాక్‌తో పోటీ సవాల్‌గా మారనుంది. పైగా, డబ్ల్యుపిఎల్‌ లీగ్‌ వేలం ప్రక్రియకు ముందు ఈ మ్యాచ్‌ జరగుతుండటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మెరుగైన ప్రదర్శనతో లీగ్‌కు ఎంపిక కావాలని చూసే వారికి ఇదొక మంచి అవకాశం. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లకు ఫిట్‌నెస్‌ సమస్యలు శరాఘాతంగా మారనున్నాయి. ప్రారంభ మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (భుజంగాయం), స్మృితి మంథాన (వేలి గాయం) గాయాల బారినపడ్డారు. సీనియర్‌ ఆటగాళ్లయిన వీరిద్దరు జట్టుకు చాలా అవసరం. అయినప్పటికీ, వారిని ఆడించడానికి రిస్క్‌ చేయలేమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, మెగా టోర్నీకి ముందు టీమిండియా మహిళలు వరుస వైఫల్యాలతో ఉన్నారు. ముక్కోణపు పోరు ఫైనల్‌లో దక్షిణాఫ్రితో ఓటమి, ప్రపంచకప్‌ సన్నాహ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పరాజయం జట్టు బలహీనతల్ని ఎత్తి చూపాయి. సెమీస్‌కు చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థుల్ని ఢీకొట్టేందుకు అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌ దళంలోకి రేణుకా సింగ్‌ను తీసుకున్నంత మాత్రాన ఆత్మవిశ్వాసం పెంచదనే వాదనలు వినిపిస్తున్నాయి. వెటరన్‌ బౌలర్‌ శిఖా పాండే తన పునరాగమనం తర్వాత ఇంత వరకు ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. స్పిన్నర్లపైనా అంతగా అంచనాల్లేవు. బ్యాటింగ్‌ విషయానికొస్తే, అండర్‌ 19నుంచి ఎంపికైన షఫాలీ వర్మపైనే అందరిచూపు ఉంది. అలాగే జెమీమా రొడ్రిగ్యూ రాణించడంపైనా జట్టు విజయాలు ఆధారపడివున్నాయి. పాకిస్తాన్‌ తరఫున నిదా దార్‌ కీలక ప్లేయర్‌గా ఉండబోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement