Sunday, April 28, 2024

ఇండియా మార్ట్‌ వీక్లీ పే పాలసీ.. ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం.. భారత్‌ నుంచి తొలి కంపెనీగా రికార్డ్..

కరోనా పరిస్థితుల్లో.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. నెలవారీ జీతాలు కూడా ఇవ్వడం లేవు. ఎక్కడైనా.. ఏ కంపెనీలో అయినా.. ప్రతీ నెలా జీతం చెల్లిస్తారు.. వారానికోసారి వేతనాలు ఇచ్చే విధానం ఎక్కడా లేదు. అయితే దీన్ని అమలు చేసేందుకు ఇండియా మార్ట్‌ నిర్ణయించుకుంది. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా దేశాల్లో అమలు చేసే వీక్లీ పేమెంట్‌ విధానాన్ని భారత్‌లో తీసుకొచ్చింది. అంటే జీతం కోసం నెల రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. ప్రతీ వారం ఉద్యోగుల చేతికి జీతం అందుతుందన్నమాట. దీంతో ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు మరింత మెరుగైన పనితీరు కనబర్చే అవకాశం ఉంటుందని కంపెనీ అభిప్రాయపడుతున్నది..

మెరుగవ్వనున్న పనితీరు..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా కంపెనీలు.. వీక్లే పే పాలసీని అమలు చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఉద్యోగుల పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఈ విషయమై అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తరువాతే.. ఇండియా మార్ట్‌ ఈ పేమెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో వీక్లీ పే పాలసీ అమలు చేస్తున్న తొలి కంపెనీగా నిలిచింది. గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఆర్థిక భారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చిందని, అవసరం కూడా పెంచిందని తెలిపింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, అమెరికా వంటి చాలా దేశాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉందని వివరించింది.

ఉద్యోగులకు ఆర్థిక సాయం..

ఇండియా మార్ట్‌ సీఓఓ దినేష్‌ గులాటీ మాట్లాడుతూ.. కంపెనీలో ప్రతీ ఉద్యోగి విధానాన్ని స్వాగతించారు. చాలా ఏళ్ల క్రితం నుంచే కంపెనీ ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతీ వారం ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. కరోనా ఔట్‌ బ్రేక్‌ తరువాత.. పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోం ఆఫర్‌ చేసిన తొలి కంపెనీగా ఇండియా మార్ట్‌ నిలిచినట్టు వివరించారు. కంపెనీ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement