Saturday, May 4, 2024

Delhi | అటల్ భూజల్ పథకంలో ఏపీని చేర్చండి.. కేంద్రానికి ఎంపీ లావు శ్రీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భూగర్భ జలాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ భూజల్ పథకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేర్చాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, పల్నాడు ప్రాంత పరిస్థితులను శ్రీకృష్ణ కేంద్రమంత్రికి వివరించారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నీటి అవసరం ఎంతో ఉందని, రైతులు సాగునీటి కోసం భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని చెప్పారు.

అటల్ భూజల్ యోజనలో ఏపీని చేరిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని షెకావత్‌కు వివరించారు. ఆనకట్టు పునరుద్ధరణ, నాగార్జున సాగర్‌ డ్యామ్‌ భద్రత, పనితీరు మెరుగుదల వంటి అంశాలను శ్రీకృష్ణ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీఆర్‌ఐపీ ఫేజ్‌2 పరిధిలోని డ్యామ్‌ల జాబితా‌లో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ ఉన్నప్పటికీ, డ్యామ్‌ భద్రత సమీక్ష ప్యానల్‌ తనిఖీ ఇంకా పెండింగ్‌లోనే ఉందని కేంద్రమంత్రికి చెప్పారు. ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని డ్యామ్‌ భద్రతా సమీక్షను నిపుణుల బృందంతో వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. ప్రధాన సాగు ప్రాంతాలైన పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో నీటి సరఫరాకు నాగార్జున సాగర్‌ డ్యామ్‌ అవసరం ఎంతో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, గజేంద్రసింగ్ షెకావత్‌కు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement