Monday, May 6, 2024

ఎడతెరిపిలేని వాన.. హైద‌రాబాద్ సిటీలో మ‌ళ్లీ కుండ‌పోత‌!

ఐదురోజులుగా భాగ్యనగరాన్ని వర్షం వీడటంలేదు. ఇవ్వాల (సోమ‌వారం) ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్‌లో సాయంత్రం కుండ‌పోత పోసింది. ఆగకుండా కురుస్తున్న ముసురుతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజులు తెలంగాణతోపాటు నగరంలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని నగర వాసులను జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

నేడు, రేపు భారీవర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల నేడు, రేపు హైద‌రాబాద్ సిటీలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ రోజుకి దక్షిణ, ఒడిశా, దక్షిణ చత్తీస్‌గఢ్‌ మీదుగా వెలుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభారం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలతో పాటు గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ..

ఇటీవల‌ కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని నగరప్రజలకు సూచించింది. నగరంలో పాత భవనాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం వెంటనే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెం బర్‌ 040-29555500కు ఫోన్‌ చేయాలని నగరవాసులకు బల్దియా సూచించింది. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విపత్తు నివారణ బృందాలను అప్రమత్తం చేసింది.

- Advertisement -

కరీంనగర్ లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒకసారిగా భారీ వర్షం కురిసింది. సోమవారం ఒకసారిగా మేఘావృత్తమై భారీ వర్షం కురియడంతో రహదారులన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు కొలనులను తలపించాయి. ఒకసారిగా భారీ వర్షం కురిసి రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement