Monday, April 29, 2024

పెరుగుతున్న కాల్‌ డ్రాప్‌ సమస్య.. లోకల్‌ సర్కిల్స్‌ సర్వే

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్‌ కనిపి స్తుంది. ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ రంగంలో ఇప్పుడు ప్రయివేట్‌ ఆపరేటర్లదే హవా. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఫోన్‌ కాల్స్‌తో పాటు, డేటా వినియోగం భారీగా పెరిగింది. డేటా ఆధారిత కాల్స్‌ పెరుగుతున్నాయి. దీని వల్ల టెలికం సంస్థలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతుంటే సడెన్‌గా కాల్స్‌ కట్‌ అవుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా కాల్‌ డ్రాప్‌ అవ్వడం అన్నది గతంలో చాలా తక్కువగా ఉంది. సెల్‌ఫోన్ల వాడకం ప్రాంరభంలో ఇలాంటి సమస్యలు వచ్చినా, నెట్‌వర్క్‌ పెరగడం, ఆధునిక సాంకేతిక పరిజ్జానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇది చాలా వరకు తగ్గింది. ఈ సమయంలో ఫోన్లలో డేటా అనేది చాలా పరిమితంగానే ఉండేది. ఇందు కోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా వరకు ప్లాన్‌తో పాటే డేటా కూడా కలిసే వస్తోంది.

ఇలా కాల్స్‌, డేటా వినియోగం పెరుగుతున్న సమయంలో వినియోగదారులు కాల్‌ డ్రాప్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. దేశంలో 339 జిల్లాల్లో లోకల్‌ సర్కిల్స్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 56 శాతం మంది కాల్‌ డ్రాప్‌ నెట్‌వర్క్‌ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నెట్‌వర్క్‌ సమస్యను అధిగమించేందుకు డేటా, వై ఫై కాల్స్‌ చేసుకుంటున్నట్లు 82 శాతం మంది చెప్పారు. గత మూడు నెలల్లో తాము కాల్‌ డ్రాప్‌ సమస్యను 20 నుంచి 50 శాతం వరకు ఎదుర్కొన్నామని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాల్‌ సరిగా కనెక్ట్‌ అవుతుందా, మధ్యలో కట్‌ అవుతుందా అన్న ప్రశ్నకు 8,364 మంది స్పందించారు. వీరిలో 91 శాతం మంది ఈ అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

ఇబ్బంది చాలా తీవ్రంగా ఉందని 56 శాతం మంది చెప్పారు. కాల్‌ నాణ్యతపై వేసిన ప్రశ్నకు 31 వేల మంది స్పందించారని నివేదిక తెలిపింది. ఇలా స్పందించిన వారిలో 42 శాతం మంది ప్రధమ శ్రేణి, 31 శాతం మంది ద్వితీయ శ్రేణి, 27 శాతం మంది తృతీయ శ్రేణి, నాలుగో శ్రేణి, గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నట్లు తెలిపింది. గడిచిన మూడు నెలల కాలంలో కాల్‌ కట్‌ అయిన సమస్యను 45 వాతం, మంది, కాల్‌ కలవక ఇబ్బంది పడినట్లు 42 శాతం మంది, మాట్లాడుతున్న సమయంలో మధ్యలోనే కాల్‌ కట్‌ అవుతుందని 76 శాతం మంది వెల్లడించారు. ఈ నివేదికను బట్టి టెలికం సంస్థలు సమస్యలను పెంచుతున్నాయని అర్ధం అవుతోంది. కాల్‌ డ్రాప్‌ కావడం, కాల్‌ కలవకపోవడం వంటి నెట్‌వర్క్‌ సమస్యలను పట్టించుకోవడంలేదని స్పష్టం అవుతోంది. కాల్‌ కట్‌ అయితే వెంటనే చాలా మంది డేటా కాల్స్‌ చేస్తున్నారు. ఈ విషయంలో టెలికం విభాగం, టెలికం నియంత్రన సంస్థ ట్రాయ్‌ జోక్యం చేసుకోవాలని, దీనిపై దర్యాప్తు చేయాలని, తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు గట్టిగా కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement