Monday, May 6, 2024

బ్యాంక్‌లకు 5 రోజులే పనిదినాలు.. ప్రతిపాదించిన ఐబీఏ

బ్యాంక్‌లకు వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలని ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి బదులుగా ఉద్యోగులు రోజూ 40 నిముషాలు ఎక్కువ పని చేయాలని ప్రతిపాదించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు జులై 28న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీఏ)తో ఐబీఏ సమావేశం కానుంది. ఎల్‌ఐసీ పనిదినాలను వారానికి 5 రోజులుగా మారుస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బ్యాంక్‌లకు ఇదే నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ నెల 19న నిర్వహించిన సమావేశంలో యూబీఎఫ్‌ఏ కోరింది. బ్యాంక్‌ ఉద్యోగుల వేతనాలు పెంపు, పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా పాలసీ తదితర అంశాలపైనా చర్చించింది. వీటిపై వచ్చే వారం ఇరు వర్గాలు చర్చించనున్నాయి. ఇందులో ప్రధానంగా బ్యాంక్‌ పనిదినాలపైనే దృష్టి సారించనున్నారు. బ్యాంక్‌ల పనిదినాలను వారానికి ఐదు రోజులు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు.

ఈ నేపధ్యంలో ఐబీఏ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించింది. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని చాలా కాలంగా బ్యాంకింగ్‌ యూనియన్లు కూడా కోరుతున్నాయి. ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి, పదవీ విరమణ చేసిన వారికి 2 లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్‌యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్‌ పాలసీని 10 లక్షల వరకు తీసుకునేందుకు అప్షనల్‌ విధానంలో అనుమతించాలని కోరుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement