Sunday, April 28, 2024

Big Story | భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం.. బ్యాంకులిచ్చే అప్పులు అంతంతే

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయ ఖర్చులు భారీ పెరిగాయి.. పెట్టుబడి వ్యయం కొన్ని పంటలకు గడిచిన మూడేళ్ళ కాలంలోనే రెట్టింపయింది.. ఎరువులకు ధరలకు రెక్కలొచ్చి విత్తనాలు మార్కెట్లో మండి పడుతున్నా, కలుపూ, కోత, దుక్కి..వాటికయ్యే డీజిల్‌, పెట్రోల్‌, కూలి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నా బ్యాంకుల నుంచి అందే పంట రుణ పరిమితి మాత్రం పెరగటం లేదు. కొన్ని పంటలకు ప్రతి ఏటా 5 నుంచి 10 శాతం పెంచటం, కొన్ని పంటల గురించి అసలు పట్టించుకోకపోవటం పరిపాటిగా మారింది. ఫలితంగా సవాలక్ష నిబంధనలు, హామీలతో బ్యాంకుల నుంచి అందే అరకొర రుణాలు సరిపోక రైతాంగం వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌ కంపెనీలపై ఆధారపడి సేద్యం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రతి సంవత్సరం కనిష్టంగా 20 శాతం పెరుగుతున్న పెట్టు-బడి వ్యయం పెరిగిన ధరలు, ప్రతికూల వాతావరణంతో గడిచిన రెండేళ్ళుగా 40 శాతానికి ఎగబాకినా బ్యాంకుల నుంచి పంట రుణ పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్బీసీ).. దానికి అనుబంధంగా పనిచేసే టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ వివిధ పంటలకు బ్యాంకులు అందించాల్సిన రుణ పరిమితిని నిర్దారిస్తుంది. ఈ ఏడాది 2023-24 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో రుణ పరిమితిని పంటల వారీగా నిర్ణయించారు. మే నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌ సీజన్‌ గా, అక్టోబరు నుంచి మరుసటి సంవత్సరం మార్చి వరకు రబీ సీజన్‌ గా పరిగణించి రుణ ఫ్రణాళికను అమలు చేస్తారు.

- Advertisement -

వరి (ఖరీఫ్‌) రూ.38 నుంచి రూ.42 వేలు, వరి (రబీ)లో రూ.42 వేల నుంచి రూ.45 వేలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జొన్నలకు రూ.19 నుంచి 21 వేలు, వర్షాధార నేలల్లో జొన్నకు రూ.17 నుంచి 20 వేలు, మొక్కజొన్నకు రూ రూ.38 నుంచి 42 వేలు, కందులకు రూ.18 నుంచి 22 వేలు, నీటి వసతి నేలల్లో పత్తికి రూ.38 నుంచి 42 వేలు, పత్తి (వర్షాధారం)కు రూ.40 నుంచి 45 వేలు, వేరుశెనగ (నీటి వసతి) రూ.28 నుంచి 32 వేలు, వేరుశెనగ (వర్షాధారం)కు రూ.32 నుంచి 35 వేలు, శనగలు రూ.28 నుంచి 32 వేలు, పొద్దు తిరుగుడు రూ.19 నుంచి 24 వేలు, పచ్చి మిర్చి రూ.68 నుంచి 75 వేలు, పండు మిరపకు రూ.80 నుంచి 90 వేలు, పొగాకుకు రూ.36 నుంచి 40 వేలు, టమాటా (హైబ్రిడ్‌) 80 నుంచి 90 వేలు, టమాటా (టెల్లీస్‌) కు రూ.65 నుంచి 70 వేలు, అరటికి రూ 65 నుంచి 80 వేలు, బొప్పాయికి రూ.72 నుంచి 75 వేలు, మామిడికి రూ.40 నుంచి 45 వేలు, నిమ్మకు రూ.22 నుంచి 27 వేల రుణ పరిమితి విధించారు.

భారీగా పెరిగిన ధరలు

గత ఏడాదితో పోలిస్తే ఎరువులే ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయి. విత్తనాల ధరలు కూడా అమాంతం పెరిగాయి. వాటితో పాటు ఇతర వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిర్ణయించటం వల్ల అన్నదాతలపై ఆర్ధికభారం మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణఖు అయిదెకరాల సాగుతో కూడిన ఒక బ్యారన్‌ కు రూ.3.5 నుంచి రూ.3.6 లక్షల దాకా రుణం వస్తుంటే పెరిగిన ధరల ప్రకారం ఒక బ్యారన్‌ కు రూ.7 నుంచి రూ.8 లక్సల దాకా ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. మిర్చికి రూ.90 వేల దాకా రుణ పరిమితి విధించగా పెట్టుబడి వ్యయం రూ.1.7 నుంచి రూ.2 లక్షలవుతుంది. అదే కౌలుకు తీసుకుని సాగు చేసే వారికి అదనంగా మరో 50 వేల పెట్టుబడి అవుతుంది.

ఖరీఫ్‌ లో అత్యధికంగా సుమారు 40 లక్షల ఎకరాల్లో పండించే వరికి పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని 30 నుంచి 40 శాతం మేర రుణ పరిమితిని పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తుండగా ఎస్‌ఎల్సీబీసీ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ మాత్రం గత ఏడాది కన్నా రూ.1500 నుంచి రూ.2 వేలను మాత్రమే పెంచింది. వరి (ఖరీఫ్‌) రూ.38 నుంచి రూ.42 వేలు, వరి (రబీ)లో రూ.42 వేల నుంచి రూ.45 వేలు పెంచింది. ఖరీఫ్‌ లో వరి తరువాత అత్యధికంగా పండించే వేరుశెనగ (నీటి వసతి)కు రూ.28 నుంచి 32 వేలు, వేరుశెనగ (వర్షాధారం)కు రూ.32 నుంచి 35 వేలు నిర్ధారించారు.

వేరుశెనగ కయ్యే ఖర్చుతో పోల్చుకుంటే బ్యాంకులిచ్చే రుణం అత్యల్పంగా ఉంటుందనీ.. ఈ దశలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించటం తప్ప మరో మార్గం ఉండటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శా అంచనాలకు విరుద్ధంగా పంట రుణ పరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ని అరకొరగా పెంచి చేతులు దులుపుకోవటం వ్యవసాయరంగానికి ఇచ్చే రుణాలపై బ్యాంకులకున్న నిర్లక్ష్యాన్ని తెలియచేస్తుందన్న భావన ఏర్పడుతోంది. మార్కెట్లో పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని హేతుబద్ధంగా లెక్కకట్టి పెట్టుబడి వ్యయంలో 20 శాతానికి మించకుండా తగ్గించి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ను నిర్దారించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement