Friday, April 26, 2024

కొలువుల క్రమబద్ధీకరణ ఇంకెన్నాళ్లు..? ప్రకటన కోసం కాంట్రాక్టు లెక్చరర్ల ఎదురుచూపులు

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఇంకా అటకెక్కడం లేదు. ఎదురుచూపులతోనే అనేకమంది కాంట్రాక్టు ఉద్యోగులుగానే పదవీవిరమణ చేస్తున్నారు. బేసిక్‌ పే అమలుతో కొంత మేర ఉపశమనం పొందుతున్నప్పటికీ క్రమబద్ధీకరణ చేస్తే పూర్తిస్థాయిలో ఫలాలు అందుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఇక కాంట్రాక్టు అనే పదం వుండబోదన్న ఆనాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనే కాంట్రాక్టు అధ్యాపకులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆంధ్రపాలనలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల103 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నామంటూ గత ఏడాది మార్చి 9న శాసనసభలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ కూడా పూర్తయింది.

- Advertisement -

ఈ క్రమబద్ధీకరణలో ప్రధానంగా ఇంటర్మీడియట్‌ విద్యకు సంబంధించి దాదాపుగా 3540 కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఉన్నారు. 10 నుండి 15 ఏళ్ల సుదీర్ఘకాలం నుంచి వేతనాలతో నెట్టుకొస్తూ ఇంటర్‌ విద్యను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరందరిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రక్రియను కూడా పూర్తి చేసింది. గత దసరా పండుగ సమయంలోనే పండగ వాతావరణంలో వీరందరికీ ఉత్తర్వులు వస్తాయన్న ఊహాగానాలు వినిపించాయి. అంతలోనే మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ రావడంతో ఈ ఉత్తరుల జారీకి బ్రేక్‌ పడినట్లు అయింది. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంట్రాక్టు అధ్యాపకుల ఆశలు చిగురుస్తాయని వారి కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. కానీ ఆర్థిక పరిస్థితి కారణమా? లేక మరే ఇతర కారణాలో తెలియనప్పటికీ క్రమబద్ధీకరణ ఉత్తర్వుల జారీలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. గత నెల రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించిన ఆయా సంఘాల నాయకులు ఈ ఉత్తర్వుల కోసం ప్రభుత్వ పెద్దల ఇళ్లకు తిరుగుతూ విన్నపాలు చేస్తున్నారు.

ఓ సంఘ నాయకులు మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర కూడా నిర్వహించారు. ప్రతి పండుగకు మంత్రుల ఇళ్లకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఏ జిల్లాలో మంత్రులు పర్యటించినా వెంటనే కాంట్రాక్టు అధ్యాపకులు వారి దగ్గరకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటున్నారు. మమ్మల్ని త్వరగా క్రమబద్ధీకరించండి అంటూ వేడుకోవడం కనిపిస్తోంది. స్పందిస్తున్న మంత్రులు త్వరలోనే మీ ఉత్తర్వులు వస్తాయంటూ భరోసా ఇస్తున్నారు. కానీ ఈ ఉత్తర్వుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు.

నెలల తరబడి అందని వేతనాలు

క్రమబద్ధీకరణ కోసం అల్లాడుతున్న కాంట్రాక్టు అధ్యాపకులకు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నెలనెలా కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, అద్దెలు, నెలసరి కిరాణా సామాగ్రి సమకూర్చుకోవడంలో అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సివస్తోందని ఆవేదన చెందుతున్నారు. స్వరాష్ట్రం వస్తే ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందనే ఆశతో ఉద్యమంలో కాంట్రాక్టు లెక్చరర్‌లు అందరూ పాల్గొన్నారు. సకలజనుల సమ్మెలో తమ ఐక్యతను చాటారు. అయితే స్వరాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు గడిచిపోయినా ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదన్న నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు.

క్రమబద్ధీకరణ చివరి దశకు చేరుకున్నట్లేనా?

ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని అధ్యాపకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జనవరి మాసం ఆరంభంలోనే ప్రభుత్వం కొత్తగా 65 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయడంతో కాంట్రాక్టు లెక్చరర్లు ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని, మా క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి పట్ల పూర్తి నమ్మకం ఉందని అధ్యాపకులు భరోసాతో ఉన్నారు. తమ ఆశలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఉన్నాయని త్వరగా ఉత్తర్వులు జారీ చేసి ఆదుకోవాలని అధ్యాపకులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలలో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పాత్ర చాలా విశేషంగా ఉంది. ఇంటర్మీడియట్‌ విద్యలో దాదాపు 70 శాతం మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలోనే విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతూ కళాశాలలో సర్వం తామై వ్యవహరిస్తున్న ఈ కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్‌లను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం బేసిక్‌ పే వేతనాన్ని అమలు చేసింది.

అంతేగాక 10 నెలలు ఉన్నటువంటి వేతనాన్ని 12 నెలలకు పొడిగించింది. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులందరికీ రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే 12 నెలల వేతనం వస్తోంది. వీరి క్రమబద్ధీకరణకు 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొందరు నిరుద్యోగులు కోర్టుకెక్కడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కానీ ప్రభుత్వ కృషితో న్యాయస్థానం కూడా కాంట్రాక్టులకు అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియను గత ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుతం క్రమబద్ధీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకోవడంతో అధ్యాపకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర్వులు రాకపోవడం మూలంగా ఉద్యోగ వయసు పైబడిన వారంతా కాంట్రాక్ట్‌ వ్యవస్థలోనే పదవీ విరమణ చేస్తున్నారు. 61 ఏళ్లు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 మంది పదవీ విరమణ చేసినట్లు అధ్యాపక సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వీలైనంత తొందరగా తమ క్రమబద్ధీకరణ జీవో విడుదల చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement