Thursday, April 18, 2024

శ్రీవారి దర్శనానికి భారీ డిమాండ్‌.. గంటన్నర వ్యవధిలోనే పూర్తయిన ప్రవేశ దర్శన టికెట్లను

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల నుంచి భారీ డిమాండ్‌ నెలకొన్నది. లక్షలాది దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన గంటల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేస్తున్నారు. సోమవారం జనవరి నెల 12 నుంచి 31 వరకు సంబంధించి 3 లక్షల 45 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 12 వేల చొప్పున సోమవారం ఉదయం 10 గంటలకు 6 లక్షల 67 వేల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయగా కేవలం గంటన్నర వ్యవధిలోనే ఈ టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. వచ్చే నెల చివరిలో శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులను టిటిడి ప్రారంభిస్తుండడంతో ఫిబ్రవరి 22 వ తేది నుంచి 28 వ తేది వరకు సంబంధించిన టికెట్లను టిటిడి విడుదల చేయలేదు.

గతంలో టిటిడి ప్రతిరోజుకు సంబంధించి 25 వేల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతుండగా ప్రస్తుతం టికెట్ల కోటాను టీటీడీ గణనీయంగా తగ్గించేసింది. కొన్ని రోజుల్లో 12 వేలు, మరికొన్ని రోజుల్లో 14 వేలు, 15 వేలు, 17 వేలు గరిష్టంగా ఇంకొన్ని రోజుల్లో 20 వేల టికెట్లను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. 41 రోజులకు గాను కేవలం 6 లక్షల 67 వేల టికెట్లను మాత్రమే టీటీడీ విడుదల చేయడంతో టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్‌ నెలకొంది. రెండు నెలలకు సంబంధించి టికెట్లను ఒకేసారి విడుదల చేయడంతో భక్తులు ఈ టికెట్ల కోసం పోటీ పడడంతో కొంత మంది భక్తులకు సైట్‌కూడా ఓపెన్‌ కాని పరిస్థితి నెలకొంది. టికెట్ల విక్రయాలు మాత్రం గంటన్నర వ్యవధిలోనే పూర్తవ్వడం విశేషం.

టికెట్లకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో వేలాదిగా హిట్స్‌ రావడంతో చాలా మంది భక్తులకు సౖౖెట్‌కూడా ఓపెన్‌ కాలేదని టీటీడీ ఐటి విభాగం అధికారులు చెబుతున్నారు. గంటన్నర వ్యవధిలోనే టికెట్లన్నింటిని భక్తులు కొనుగోలు చేయడంతో అది తెలియని భక్తులు ఇంకా టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్న పరిస్థితి నెలకొంది. ఇక టికెట్లు దొరకని భక్తులు ప్రతిరోజూ తిరుపతిలోని మూడు ప్రదేశాల్లో టిటిడి జారీచేసే సర్వదర్శనం టికెట్లను పొంది కాని లేక నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం క్యూ లైన్‌ గుండా శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement