Wednesday, March 27, 2024

తెలంగాణపై ప్రధాని ఫోకస్, 19న రాష్ట్ర పర్యటన.. సికింద్రాబాద్‌లో వందేభారత్ ట్రైన్ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 19న తెలంగాణ పర్యటనలో ఆయన రూ.7వేల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేయడంతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు ఆయన ప్రధాని తెలంగాణ పర్యటనపై సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రతిష్టాత్మక వందేభారత్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రూ.699 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహిస్తారు.

ఆ తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని రూ.1850 కోట్ల వ్యయంతో దాదాపు 150 కి.మీ.ల పొడవున తెలంగాణలో చేపట్టనున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు, రూ.521 కోట్ల వ్యయంతో కాజీపేటనందు నిర్మించనున్న ‘రైల్వే పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు భూమిపూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత రూ.1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ.ల పొడవైన రైల్వే డబుల్ లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఐఐటీ హైదరాబాద్‌లో రూ.2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రధాని  ప్రారంభిస్తారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు, భూమి పూజ నిర్వహించే ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 7,076 కోట్లని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement