Sunday, May 5, 2024

ఆగష్టు 1నుంచి ఇంటింటి సర్వే.. విస్తృత కార్యచరణతో ఈసీ ముందడుగు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇకపై ఓటర్‌ జాబితాను పక్కాగా, నిక్కచ్చిగా రూపొందించేలా ఎన్నికల సంఘం సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఓటర్‌ నమోదులో పలుదశల్లో అవకాశమిస్తూ ఫారం-8ఏ ను రద్దు చేసేందుకు సిద్దమైంది. బోగస్‌ ఓటర్లను ఏరివేసేందుకు అనేక సాంకేతికతలతో యాప్‌లను వినియోగిస్తోంది. త్వరలోనే ఆధార్‌కార్డుతో ఓటర్‌ ఐడీని అనుసంధానం చేసే ప్రతిపాదన అమలుకు యోచిస్తోంది. ఇకమీదట 18 ఏళ్లు నిండేసరికే ఓటర్‌ జాబితాలో పేరు చేర్చి ఓటర్‌ ఐడీని అందించేలా కార్యచరణ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఒక్కో ఓటుపై అభ్యంతరాలు, దొంగ ఓట్లు, బోగస్‌ ఓట్ల వ్యవహారంతో చర్చ జరగడం ఎన్నికల సంఘానికి చెడ్డపేరు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో పారదర్శికతకు పెద్దపీట వేసేలా కసరత్తు చేస్తున్నది. ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండే పరిస్థితులను రూపుమాపేందుకు అనేక సంస్కరణలను రూపొందిస్తున్నది.

తాజాగా ఓటు నమోదుకు ఉన్న 18ఏళ్లు నిండిన యువతకు అవకాశాలను కేంద్ర ఎన్నికల సంఘం మరింత విస్తృతం చేసింది. జనవరి 1నాటికి 18ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన యువతకు ఈ దఫా అవకాశం కల్పించేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. 18ఏళ్లు నిండేవరకు వేచిచూడాల్సిన అవసరంలేదని ఎన్నికల సంఘం పేర్కొంటోంది. 17ఏళ్లు నిండినవారికి ఓటర్‌కార్డు కోసం ముందస్తు దరఖాస్తులకు అకాశమివ్వనుంది. ఇకపై 17ఏళ్లు వాటినవారంతా ముందస్తు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18ఏళ్లు నిండిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం వారికి కార్డును అందించి ఓటు హక్కును కల్పిస్తుంది. కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌, అనుదీప్‌ చంద్రపాండేలు ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహనకు ఆదేశించింది.
గతంలో ఓటర్‌ నమోదుకు జనవరి 1ని ప్రామాణికంగా తీసుకోవడం ఆనవాయితీగా ఉంది.

ఆ తేదీనాటికి 18ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు లభించడం జరిగేది. కాగా ఈ ఏడాదినుంచి తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1లను ప్రామాణికంగా తీసుకొని ఓటు హక్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఓటర్‌ జాబితాలో తప్పులను సరిజేతకు, సవరణలకు పూర్తిస్థాయిలో అవకాశాలను విస్తృతం చేసింది. ఆగష్టు 4నుంచి అక్టోబర్‌ 24 వరకు ప్రీ రివిజన్‌ తర్వాత నవంబర్‌ 9న ముసాయిదా ఓటర్‌ జాబితాను వెల్లడించనున్నారు. డిసెంబర్‌ 8వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 5 తర్వాత తుది ఓటర్‌ జాబితాను ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. ఓటర్‌ నమోదుకు ఏటా నాలుగుసార్లు అవకాశం కల్పించనున్నారు. దీంతో ఓటు హక్కు పొందేవీలు ప్రజలకు మరింత చేరువకానుంది. ఎన్‌వీఎస్‌ఆర్‌ పోర్టల్‌లో నేరుగా ఫోన్‌ ద్వారా ఓటు హక్కును పొందేందుకు మరింత సులభతరమైన విధానాలను ఈసీ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫారం 6, ఫారం 7, ఫారం 6బీ, ఫారం 8లను కొత్త రకంలో అందుబాటులోకి తేనున్నారు. ఫారం 8ఏను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఇకపై బూత్‌స్థాయి అధికారివద్ద కొత్త ఫారాలు మాత్రమే అందుబాటులో పెట్టనున్నారు. వచ్చే నెల 1నుంచి ఇంటింటి సర్వే చేపట్టేందుకు ఎన్నికల సంఘం షడ్యూల్‌ సిద్దం చేసుకుంటోంది. ఓటర్‌ వివరాలతోపాటు, ఆధార్‌ నెంబర్‌ను సేకరించనున్నారు. ఆధార్‌ తప్పనిసరికాగా ఓటర్‌ వివరాలు బైటికి వెల్లడికాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆధార్‌ కార్డును ఇవ్వని ఓటర్లు ఈజీఎస్‌ జాబ్‌కార్డు, బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతా బుక్‌ను, హెల్త్‌ ఇన్ష్యూరెన్స్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, పెన్షన్‌ డాక్యుమెంట్‌, ఉద్యోగులు ఎంప్లాయీ ఐడీకార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధికారి కార్డులు, యూనిక్‌ ఐడీ రిజిస్ట్రేషన్లకు చెందిన ఏదైనా కార్డును జత చేయాలని ఈసీ సూచించింది. ఈ మేరకు బోగస్‌ ఓట్లకు చెక్‌ పెట్టేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. తద్వారా ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో పారదర్శక ఎన్నికలకు ఇది కీలక అడుగుగా మారనుందని ఎన్నికల సంఘం చెబుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement