Saturday, May 18, 2024

అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం.. ఈశ్రమ్ పథకంపై వివరాలు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. అసంఘటితరంగ కార్మికుల సమస్యలు, వారికందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈశ్రమ్ పథక తీరుతెన్నులపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి రామేశ్వర్ తేలి గురువారం లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య ఎంత, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిన వారి సంఖ్య, విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు ఈశ్రమ్ పథకానికి కేటాయించి, ఖర్చు పెడుతున్న నిధుల వివరాలు, జాతీయ పెన్షన్ పథకానికి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకాలకు అర్హులైన, రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారుల వివరాలు అందించవలసినదిగా జీవీఎల్ కేంద్రాన్ని కోరారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఒక కోటీ 50 లక్షల 92,000 మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నట్లుగా అంచనా వేశామని మంత్రి తెలిపారు.

ఇప్పటివరకు సంవత్సరాల వారీగా రూ. 330 కోట్ల రూపాయల నిధులను కేటాయించి రూ. 301 కోట్లను ఖర్చు పెట్టినట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2023 వ సంవత్సరానికిగాను కేటాయించిన 500 కోట్లలో ఇప్పటివరకు రూ. 105 కోట్లను విడుదల చేశామని తెలిపారు. ఈశ్రమ్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, జాతీయ పెన్షన్ పథకానికి కూడా అర్హులని పేర్కొంటూ, లబ్ధిదారులు వివరాలను జిల్లాలవారీగా వెల్లడించారు. విశాఖపట్నంలో ఇప్పటివరకు ఈశ్రమ్ పథకం కింద 5,45,236 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కింద విశాఖపట్నం నగరంలో 15,989 రిజిస్ట్రేషన్లు, జాతీయ పెన్షన్ పథకం కింద కేవలం 115 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని బదులిచ్చారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, జాతీయ పెన్షన్ పథకం అసంఘటిత రంగ కార్మికులకు పూర్తిస్థాయి రక్షణను, భరోసానిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ నిధుల మీద దృష్టి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటి ఫలాలను లబ్దిదారులకు అందజేయడంలో శ్రద్ద వహించట్లేదని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement