Saturday, May 18, 2024

రంగారెడ్డి జిల్లా టీచర్ల ప్రమోషన్లపై హైకోర్టు స్టే.. కాస్త ఆలస్యం కానున్న బదిలీలు, పదోన్నతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్ల ప్రమోషన్లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని విద్యాశాఖను ఈమేరకు కోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లాలో ప్రమోషన్లకు సంబంధించి సీనియారిటీ జాబితాపై సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌లు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.

317 జీవో ద్వారా జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లాలోని కేడర్‌ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. దీంతో అభ్యంతరాలను పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తాని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈ నెల 19 వరకు సమయం ఇవ్వాలని కోరారు.

దీంతో విద్యాశాఖ కార్యదర్శిఆ, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, రంగారెడ్డి డీఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా పడనుంది. ఇదిలా ఉంటే ఈ కేసు నేపథ్యంలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఆలస్యమయ్యేటట్లు కనబడుతోంది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3 కల్లా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement