Friday, April 26, 2024

శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జనవరి 25కు వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైల్లో ఉన్న పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జనవరి 25కు వాయిదా పడింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. తొలుత ఈడీ తరఫున వాదనలు వినిపిస్తూ మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని న్యాయవాది తెలిపారు. సౌత్ గ్రూప్ తరఫున మొత్తం రూ. 100 కోట్లు ముడుపులుగా విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారని, అందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డి 5 రిటైల్ జోన్లు కైవసం చేసుకున్నారని వివరించారు. వాటిని ట్రైడెంట్, అవంతిక ఆర్గోనామిక్స్ తదితర పేర్లతో శరత్ చంద్రారెడ్డి నిర్వహించారని వెల్లడించారు.

ఈ మూడు సంస్థల కార్యాలయాలు ఒకే చిరునామాతో ఉండడం ఒకెత్తయితే, రెండు సర్వర్లలో మూడు కంపెనీల రికార్డులు దొరికాయని చెప్పారు. ఈ 5 జోన్లలో అమ్మకాల ద్వారా వచ్చిన నగదు మొత్తం ప్రతి రోజూ డిఫెన్స్ కాలనీలోని బేస్మెంట్ కార్యాలయానికి చేరేదని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ శరత్ చంద్రారెడ్డి పాత్రను నిర్థారిస్తున్నాయని వివరించారు.

ఈడీ వాదనల అనంతరం శరత్ చంద్రారెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఈడీ సౌత్ గ్రూపు పేరు పదే పదే ప్రస్తావించిందని, మనీలాండరింగ్ నేరాలు వ్యక్తుల మధ్య లేదా కంపెనీల మధ్య జరిగే లావాదేవీల ఆధారంగా నడుస్తాయని అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినవారు, లంచం తీసుకున్నవారు, లంచం సొమ్మును ఈడీ ఎక్కడా నిరూపించలేకపోతోందని, అసలు ప్రభుత్వ అధికారుల పాత్ర, ప్రమేయమే లేకుండా ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలను ముడుపులుగా ఎలా పేర్కొంటారని సిబల్ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులకు చేసే చెల్లింపులను లంచంగా చట్టం పరిగణిస్తుందని, కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులకు చెల్లింపులు జరిపినట్టుగా ఎక్కడా నిరూపణ కాలేదని అన్నారు.

- Advertisement -

మరోవైపు సౌత్ గ్రూప్ పేరుతో పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించారని, కానీ అందులో కొందరినే సెలెక్ట్ చేసి అరెస్టు చేశారని కపిల్ సిబల్ అన్నారు. ఈడీ వాదనల్లో ట్రైడెంట్ కంపెనీ ఉద్యోగి చందన్ రెడ్డి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకున్నారని, కానీ చందన్ రెడ్డిని కనీసం సాక్షిగా కూడా చూపలేదని అన్నారు. అలాంటి వ్యక్తి వాంగ్మూలాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. పైగా చందన్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తాము కోరుకున్నట్టుగా వాంగ్మూలం రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని, ఈ అంశంపై కేసు కూడా నడుస్తోందని కపిల్ సిబల్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేయాల్సిందేనని వాదించారు.

శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన తర్వాత బోయినపల్లి అభిషేక్, బినోయ్ బాబు తరఫున కూడా వాదనలు జరిగాయి. ఈలోగా కోర్టు సమయం ముగియడంతో కేసు విచారణ ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్టుగా న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ప్రకటించారు. అదే రోజు విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. మొత్తంగా ఈ కేసులో ఐదుగురు నిందితుల బెయిల్ భవితవ్యం ఈ నెల 25న తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement