Friday, June 9, 2023

విద్వేషం మన సంస్కృతికి వ్యతిరేకం, బాగా చదివి దేశ పురోగతిలో భాగస్వాములు కావాలి : ఉప‌రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటులేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమన్నారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారతదేశంలో అశాంతి రేకెత్తించేందుకు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకుని వాటిని భగ్నం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఈ నిరసన ఆందోళనలను రేకెత్తించే విధంగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంతోనే పురోగతి సాధ్యమవుతుందన్నిఅభిప్రాయపడ్డారు. జాతీయవాదం, దేశభద్రత అంశాల్లో రాజీపడాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. శుక్రవారం సాయంత్రం తనను కలిసిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) తెలుగు విద్యార్థులతో వెంకయ్య నాయుడు సంభాషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంత దూరం ఢిల్లీకి వచ్చిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ ప్రాంతంతో పాటు దేశానికి కూడా పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పుస్తకాల్లోని విజ్ఞానాన్ని పొందడంతోపాటుగా సృజనాత్మకమైన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. పంచభూతాలను కాపాడినపుడే వాటినుంచి మనకు రక్షణ లభిస్తుందని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా యువత కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. మాతృభాషను ప్రోత్సహిస్తూ, దైనందిన జీవితంలో వాడాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వెంకయ్య నాయుడు వివరించారు. తాను రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ భాషల్లో రాజ్యసభ సభ్యులు మాట్లాడేందుకు అనుమతించిన విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement