Sunday, April 28, 2024

జపనీస్ కోర్సులో తొలి విద్యార్థిగా హర్యానా సీఎం.. కురుక్షేత్ర వర్సిటీ వెల్లడి

చండీగఢ్: విద్యాభ్యాసానికి వయోపరిమితి లేదు. ఆసక్తి ఉంటే నిరంతరం విద్యాభ్యాసం కొనసాగించొచ్చు. అదే విషయాన్ని నిరూపిస్తున్నారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్శిటీ జపనీస్ సంస్కృతి, భాషపై మూడు నెలల ఆన్ లైన్ కోర్సు ఆఫర్ చేస్తోంది. ఆ కోర్సు చేయాలని ఉబలాటపడిన సీఎం ఖట్టర్ స్వయంగా ఎన్ రోల్ అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ అధికారులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. జపనీస్ కోర్సులో చేరిన తొలి విద్యార్థి సీఎం ఖట్టరేనంటూ తెగ సంబరపడిపోయారు. విదేశీ భాషలను నేర్చుకోవడమంటే ఖట్టర్ కు మెుదటినుంచి అలవాటు. ఇప్పుడు జపనీస్ భాషపై మనసు పారేసుకున్నారు. దేశీయంగా ఆర్థికవ్యవస్థలో వచ్చిన మార్పులు, జపాన్ పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం మెరుగవుతోంది.

తరచూ జపాన్ బృందాలతో భేటీ అవ్వాల్సివస్తోంది. అందవల్ల ఆ భాషలో కనీస పరిజ్ఞానం ఉంటే మంచిదని సీఎం భావించారు. అందుకే స్థానిక వర్శిటీలో ఆన్ లైన్ విద్యార్థిగా చేరారు. ఆయనతోపాటు అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఈ కోర్సులో చేరడం కొసమెరుపు. ఇది వర్సిటీకి ప్రతిష్టాత్మక పరిణామమని, విద్యార్థి, బోధనావర్గాలకు స్ఫూర్తిదాయకమని కురక్షేత్ర వర్శిటీ వీసీ ప్రొ.సోమ్ నాథ్ సచదేవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement