Thursday, May 9, 2024

హైదరాబాద్‌లో హ్యాండ్‌బాల్‌ అకాడమీ.. వెల్ల‌డించిన జ‌గ‌నమోహ‌న్ రావు

హైదరాబాద్‌: ”రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ సంఘం, ఆసియా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ సహకారంతో హైదరాబాద్‌లో త్వరలో ఒక అంతర్జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ అకాడమీని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. దీనికి అనుబంధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని ఫీడర్‌కేంద్రాలను ఏర్పాటు చేస్తాం” అని జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆర్శనపల్లి జగన్‌మోహన్‌రావు వెల్లడించారు. గురువారంనాడిక్కడ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా హ్యాండ్‌బాల్‌ పురుషుల క్లబ్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ను పర్యవేక్షిస్తూ… జగన్‌మోహన్‌రావు మీడియాతో మాట్లాడారు. ”హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్‌ హబ్‌గా మార్చేలా ఈ అకాడమీ నిర్మాణం ఉండబోతుంది. అత్యుత్తమ సౌకర్యాలతో అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం త్వరలో ఒక బృందం ప్రపంచంలోని అత్యుత్తమ హ్యాండ్‌బాల్‌ అకాడమీలను సందర్శించనుంది. వారి నివేదిక, నిపుణుల ఆలోచనలకు అనుగుణంగా సకల హంగులతో అకాడమీని నిర్మిస్తాం. ఇందులో హాస్టల్‌, జిమ్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌, రిహాబిలేషన్‌ సెంటర్‌ వంటి అన్నింటిని ఏర్పాటు చేస్తాం” అని జగన్‌మోహన్‌రావు వివరించారు. వచ్చే నెలలో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ నిపుణులతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ట్రైనింగ్‌ ప్రోగ్సామ్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కేంద్ర, రాష్ట్ర క్రీడా శాఖల సహకారంతో హైదరాబాద్‌ వేదికగా రెండు జాతీయ, ఒక అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌ నిర్వహించాం. దీంతో హైదరాబాద్‌కు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌కు రూపకల్పన చేశాం. భవిష్యత్‌లో ఇది రాష్ట్ర స్థాయికి కూడా విస్తరిస్తాం. తద్వారా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. నాణ్యమైన ప్లేయర్ల సంఖ్య పెరుగుతుందన్నారు.

హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో పలు అంశాల్లో మన జట్లు అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నాయని వివరించారు. జాతీయ జట్ల కూర్పులో ఎక్కడా పక్షపాతానికి తావివ్వకుండా ప్రతిభకు అగ్రతాంబూళం ఇచ్చాం. వాటి ఫలితంగానే ఇటీవల ఆసియా మహిళల జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత విజేతగా నిలిచిందన్నారు.
”క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ తరహాలో హ్యాండ్‌బాల్‌కు ఆదరణ పెంచడం చాలా పెద్ద ప్రక్రియ. ఏ గేమ్‌కైనా గుర్తింపు, క్రేజ్‌ రావాలంటే అది ప్రతిభావంతులైన క్రీడాకారుల ద్వారానే సాధ్యం. అత్యుత్తమ ప్లేయర్లను తయారుచేస్తే వారు సాధించే విజయాలే దేశంలో హ్యాండ్‌బాల్‌కు ఆదరణ తీసుకొస్తుంది. వారే హ్యాండ్‌బాల్‌ను ప్రమోట్‌ చేస్తారు. గుర్తింపు తీసుకొస్తారు. అయితే హ్యాండ్‌బాల్‌ టీమ్‌ స్పోర్ట్‌ కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. రెండు మూడు నెలల్లో నిర్వహించనున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ ద్వారా ఈ దిశగా తొలి అడుగులు పడనున్నాయి. కార్పొరేట్‌ లీగ్‌ల నిర్వహణ, అత్యుత్తమ క్రీడాకారుల తయారీకే పరిమితం కాకుండా సోషల్‌ మీడియా ప్రమోషన్‌పై కూడా దృష్టి పెట్టనున్నాం” అని జగన్‌మోహన్‌రావు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement