Sunday, May 19, 2024

Delhi | ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ఏపీ భవన్‌లో రెండురోజులు వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ భవన్‌లో భోగి, సంక్రాంతి వేడుకలను ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భోగి సందర్భంగా ఆదివారం ఉదయం భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్, యూపీఎస్సీ సభ్యురాలు ప్రీతి సుడాన్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ప్రారంభించారు.

భోగి సందర్భంగా పిల్లలకు డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(తేవా) ఆధ్వర్యంలో జరిగిన పొంగలి తయారీ, గంగిరెద్దుల ఆట, గొబ్పి పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం భోగిమంటలు, నాదస్వరంతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఏలూరు నుంచి వచ్చిన కళాకారుల బృందం ప్రదర్శించిన గోదా కళ్యాణం భామా కలాపం, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి.

ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ దంపతులను ఆర్సీ, ఏఆర్సీలు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం లవ్ అగర్వాల్ మాట్లాడుతూ సొంత ఊళ్లకు దూరంగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా చేయడానికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్‌ను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏపీ భవన్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు చూడడానికి పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement