Monday, May 6, 2024

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 8.30 వరకు కొనసాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చిన మహిళలు మధ్యాహ్నం నుంచే బతుకమ్మను అందంగా పేర్చడంతో పాటు సాయంత్రం ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని పేర్కొన్నారు. ఢిల్లీ గడ్డపై కర్తవ్యపథ్ వేదికగా బతుకమ్మ సంబరాలు జరగడం ద్వారా తెలంగాణ గౌరవానికి ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో భాగంగా ఏడాదిపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఢిల్లీలో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కార్యక్రమంలో కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిఆ సర్బానంద్ సోనోవాల్, పీఎంవో, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తదిరులు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సతీమణి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సతీమణితోపాటు పలువురు ప్రముఖులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ఢిల్లీలో వివిధ విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారిణులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ఉండే తెలుగువారితోపాటు చాలా మంది స్థానికులు కూడా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement