Tuesday, April 30, 2024

Delhi | గంగా పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. వారణాసిలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమీక్షా సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. శుక్రవారం ఆయన కాశీలో ప్రతిష్టాత్మక గంగా పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. కాశీ విశ్వనాథుడి దర్శనం అనంతరం గంగా ఘాట్లను జీవీఎల్ సందర్శించారు. ఈ నెల 22 నుంచి మే 3 వరకు జరిగే పన్నెండు రోజుల పుష్కరాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకూడదని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాట్లపై జీవీఎల్ నరసింహారావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజలింగం, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లా అధిపతులతో పాటు తెలుగు ఆశ్రమాలు, ధర్మశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

జీవీఎల్‌తో సమన్వయం చేసుకుంటూ వారణాసి జిల్లా ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం, భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా కోట్లాది మంది పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించనున్నట్టు అంచనా. జీవీఎల్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, వారణాసి ఆయనకు నోడల్ జిల్లాగా ఉంది. గంగా నదీ తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రినాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ తదితర పుణ్యక్షేత్రాలు ఇప్పటికే పుష్కర శోభను సంతరించుకున్నాయి. పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement