Monday, April 29, 2024

వారం పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి : గంగుల కమలాకర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు మరో వారం, పది రోజుల్లో పూర్తి కానున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియలో గన్నీలు, గోడౌన్లు, ట్రాన్స్‌ పోర్టు ఇబ్బందులు ఏమీ లేవన్నారు. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై గురువారం కరీంనగర్‌లో శ్వేతపత్రం విడుదల చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నా దాదాపు 3వేల కోట్ల నష్టాన్ని భరించి రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టోల్‌ ఫ్రీ నంబర్లు, వార్‌ రూంలను ఏర్పాటు మిల్లర్లు, హమాలీల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కొనుగోళ్ల కోసం 13కోట్ల 69లక్షల గన్నీలు సేకరించామని, ఇంకా 14లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోయేన్ని 3కోట్ల 37లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయన్నారు. అకాల వర్షాలకు తడిసిన 15వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామన్నారు. ఎక్కడా ధాన్యం రవాణాకు ఇబ్బందులు రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6579 కొనుగోలు కేంద్రాల ద్వారా గురువారం వరకు 7లక్షలా 7వేల మంది రైతుల నుంచి 8వేల కోట్ల విలువైన 41.33లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. జూన్‌ 10 కల్లా మరో 11.43లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావొచ్చని చెప్పారు. ఇందులో దాదాపు 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు కూడా పంపించామన్నారు.

కొనుగోళ్లు ముగిసిన 2257 కేంద్రాలను మూసివేసినట్లు చెప్పారు. ధాన్యం నిల్వలో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా… రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట్‌, జగిత్యాల, మెదక్‌ తదితర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం పెద్దపల్లి, కరీంనగర్‌, వనపర్తి, వరంగల్‌, జోగులాంబ గద్వాల జిల్లాలకు 2.64లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తరలించామన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన చివరి గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ రైతులకు అండగా నిలిచారని చెప్పారు. యాసంగిలో నూకశాతం ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం ముడిబియ్యమే కావాలని పట్టుబట్టిందన్నారు. కేంద్ర మొండి వేఖరితో తెలంగాణ ప్రభుత్వంపై మూడువేల కోట్ల భారం పడిందన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా వారిని రైతులు నమ్మలేదన్నారు. త్వరలోనే టెస్ట్‌ మిల్లింగ్‌ సైతం ప్రారంభం కానుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement