Tuesday, May 14, 2024

TS | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 4.8 శాతంతో మరో డీఏ మంజూరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మరో కరువు భత్యం (డీఏ)ను మంజూరు చేసింది. ఈమేరకు టీఎస్‌ ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు పెండింగ్‌లోని మొత్తం 9 డీఏలను సంస్థ మంజూరు చేసింది. తమ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సం(టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్‌ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారన్నారు.

సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ ఆర్టీసీఅని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసిందన్నారు. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ ప్రకటించిన డీఏపై ఆర్టీసీ జేఏసీ నేతలు స్పందింస్తూ 2019 జులై నుండి 2023 వరకు 9 డీఏలు అమలు చేసినట్లు అవుతుంది తప్ప… అవి అమలు కావాల్సిన రోజు నుండి అమలు కాలేదని పేర్కొన్నారు. మొత్తం 173 నెలల డీఏ అరియర్స్‌ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లలించాల్సి ఉంటుందన్నారు. ఈరకంగా చూసుకుంటే ఒక్కో కార్మిక కుటుంబానికి సగటున రూ.1.70 లక్షలు రావాల్సి ఉందని అంటున్నారు.

- Advertisement -

అవి త్వరలో చెల్లించి ఉద్యోగులను ఆదుకోవాలని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల బకాయిల చెల్లింపుపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన ఆర్పీఎస్‌ 2013 అరియర్స్‌ బాండ్‌ డబ్బులు, 173 నెలల డీఏ అరియర్స్‌తో పాటు ఇతర బకాయిలు కూడా మంజూరు చేయాలని ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement