Tuesday, May 14, 2024

Mansoon: ఢిల్లీకి గుడ్​ న్యూస్​.. రెండు, మూడు రోజుల్లో పలకరించనున్న తొలకరి జల్లులు!

రాగల రెండు, మూడు రోజుల్లోగా నైరుతి రుతుపవనాలు ఢిల్లీని చేరుకోనున్నాయి. జూన్ 30న కానీ, జూలై 1న కానీ ఢిల్లీలో తొలకరి పలకరిస్తుందని, దీంతో వర్షాలు మెండుగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు మంగళవారం తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 27న దేశ రాజధానికి వస్తాయి. జూన్ 30న సిటీలో మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గురువారం లేదా శుక్రవారం రుతుపవనాల రాకను చూడొచ్చని IMD సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లలో రుతుపవనాలు మరింతగా ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు.  

తరువాతి 48 గంటల్లో ఉత్తరప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, జార్ఖండ్​, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాలలో రుతుపవనాలు బాగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోందని, అంతేకాకుండా గాలిలో అధిక తేమతో చెమట, ఉక్కపోత వంటి అసౌకర్యాలకు ప్రజలు గురవుతున్నారని జెనమణి చెప్పారు.

రుతుపవనాలకు ముందు అధిక వేడి కారణంగా రేపు (బుధవారం) సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసి, వేడి నుండి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉందన్నారు. జూన్ 30న నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. దీనికి ఇప్పటికే ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని.. జులై 1 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 33-34 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని ఆయన తెలిపారు. అయితే.. గత ఏడాది రుతుపవనాలు సాధారణంగా జూన్ 27 కంటే దాదాపు రెండు వారాల ముందే ఢిల్లీకి వస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

అయితే.. ఇది కాస్త తలకిందులైది. వారి అంచనాలు తప్పి జూలై 13 వ తేదీకి కానీ వర్షాలు కురవలేదు. గత ఏడాది అయితే 19 సంవత్సరాల్లో అత్యంత ఆలస్యంగా రుతుపవనాల రాకను ఇక్కడి ప్రజలు చూశారు.  అయితే, ఈసారి మాత్రం అట్లాంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చని, ఎందుకంటే బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ సమస్యలు తలెత్తలేదన్నారు. ఈసారి ప్రధానంగా గాలితో సాగే రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని ఆయన చెప్పారు. IMD డేటా ప్రకారం.. గత 62 ఏళ్లలో రుతుపవనాలు జూన్‌లో 29 సార్లు.. జులైలో 33 సార్లు ఢిల్లీని కవర్ చేశాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement