Wednesday, May 15, 2024

AP | జెన్‌కో, జయహో.. ఎన్టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చింది. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడం, విద్యుత్‌ వినియోగదారులకు 24/7 నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేసే లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్‌కో) వేసిన మరో అడుగు విజయవంతమైంది. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌)లో కొత్త 800 మెగావాట్ల యూనిట్‌-8 (స్టేజ్‌-5)ని ఆదివారం ఉదయం 09:07 గంటలకు అన్ని పరీక్షలు నిర్వహించి, కమిషనింగ్‌ కార్యకలాపాలు పూర్తి చేసిన తర్వాత గ్రిడ్‌కి విజయవంతంగా అనుసంధానించారు.

దీంతో విద్యుత్‌ అవసరాలు తీర్చే క్రమంలో విద్యుత్‌ సంస్థలపై వత్తిడి తగ్గనుంది. ఈ 800 మెగా వాట్ల యూనిట్‌ బాయిలర్‌ను సూపర్‌ క్రిటికల్‌ సాంకేతికతతో నిర్మించారు. ఈ యూనిట్‌లో ఇంధన సామర్థ్య టర్బైన్‌, జనరేటర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో సరైన వినియోగానికి అనుగుణంగా యూనిట్‌ నిర్మించారు. నీటి ఆదా కోసం యూనిట్‌ ఈటీసీ జీరో డిశ్చార్జితో అందించబడుతుంది. యూనిట్‌ పూర్తి లోడ్‌తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కానుంది. ఈ ప్లాంటు 100 శాతం బూడిద వినియోగం కోసం ఏర్పాటు చేయబడింది.

- Advertisement -

విద్యుదుత్పత్తిలో ముందంజ..

ఈ ఏడాది మార్చిలో నెల్లూరులోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో 800 మెగావాట్ల యూనిట్‌-3 కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి సీఓడీ పూర్తయింది. ఈ ఎన్‌టీటీపీఎస్‌ కొత్త యూనిట్‌ యొక్క ట్రయల్‌ ఆపరేషన్‌తో ఏపీ జెన్‌కో యొక్క థర్మల్‌ ఇన్‌స్టాల్డ్‌ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే ఇటీవలి కాలంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే రెండు 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ యూనిట్లు ప్రారంభమవడం విశేషం.

రాష్ట్ర విభజన తర్వాత అత్యధిక వినియోగం..

కాగా జెన్‌కో రాష్ట్ర గ్రిడ్‌కు రోజువారీగా దాదాపు 102 నుండి 105 మిలియన్‌ యూనిట్లను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో 40 నుండి 45 శాతంగా నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఇది నమోదవడం విశేషం. ఏపీ జెన్‌కో బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. మెరుగైన హీట్‌ రేటు, ఇంధన వనరుల ఆప్టిమైజేషన్‌తో తక్కువ ఖర్చుతో కూడిన, సమర్థవంతమైన విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తోంది. ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తుందని ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్‌ అన్నారు.

సిబ్బందికి అభినందనలు..

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఏపీ జెన్‌కో చైర్మన్‌ కే విజయానంద్‌, ఏపీ జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు ఈ మైలురాయిని సాధించడంలో ఏపీ జెన్‌కో టీ-మ్‌, బీహెచ్‌ఈఎల్‌, బీజీఆర్‌ ఈపీసీ కాంట్రాక్టర్‌లను అభినందించారు. అదే స్ఫూర్తితో, అంకితభావంతో అందరూ జులై 2023 చివరి వారం నాటికి యూనిట్‌ కోడ్‌ని సాధించడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఏపీ జెన్‌కోకు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని, అందుకు వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement