Sunday, April 28, 2024

Delhi: ‘గాలి’కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ‌.. బెయిల్ కండిష‌న్స్‌ సడలింపు పిటిష‌న్ క్యాన్సెల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుగాలి వీచింది. అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కఠినమైన షరతులతో కూడిన బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ బెయిల్ నిబంధనలను సడలించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే బళ్లారిలో మాత్రం నెల రోజుల పాటు ఉండేందుకు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు గాలి జనార్థన్ రెడ్డి ఎదుర్కొంటున్న అభియోగాలపై న్యాయస్థానంలో విచారణ (ట్రయల్) 6 నెలల్లోగా పూర్తిచేయాలని, ఈ క్రమంలో రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది.

గత విచారణ సందర్భంగా కేసు నమోదు, చార్జిషీట్ దాఖలు చేసి పదేళ్లు దాటినా ట్రయల్ పూర్తికాకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలంటూ ట్రయల్ కోర్టును సీల్డ్ కవర్ నివేదిక కోరింది. పదే పదే డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తూ ట్రయల్‌కు అంతరాయం కల్గిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది. ఇదే పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, తుది ఉత్తర్వులు జారీ చేసింది.

బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మైనింగ్ లీజు సరిహద్దు గుర్తులను మార్చడంతోపాటు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు గాలి జనార్ధన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల మైనింగ్‌ కుంభకోణంలో గాలి జనార్ధనరెడ్డికి గతంలో బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలతో సహా కొన్ని జిల్లాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. అయితే ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలో పర్యటించాలని గాలి జనార్దనరెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చిన తన కుమార్తెను చూసేందుకు కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె ప్రసవం బళ్లారిలో కాకుండా బెంగళూరులో జరిగిందని.. అనంతరం ఆమెను బళ్లారికి తీసుకువచ్చారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గాలి జనార్ధన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోవడంతో బెంగళూరు వెళ్లారని, ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చిందని.. ఆమెను చూసేందుకు వెళ్లడానికి గాలి జనార్ధన్ రెడ్డి అనుమతివ్వాలని కోరారు. ఈ వాదనలు గత విచారణ సందర్భంగానే పూర్తవగా, ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరిస్తూ బళ్లారిలో నెల రోజులపాటు ఉండేందుకు అనుమతించింది. బెయిల్ షరతుల్లో వేటినీ సవరించేందుకు ధర్మాసనం అంగీకరించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement